TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ గూటికి జగన్?

Published on: Mon Aug 24, 2026 4:52PM

వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడేళ్లవుతోంది... సిబిఐ విచారణ ముగిసిందనుకుంటున్న సమయంలో, హఠాత్తుగా ఈడీ ఎందుకు ఎంటర్ అయింది?  అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. దీనిపై సీనియర్ జర్నలిస్టు, ఎనలిస్ట్ వీవీరావు తెలుగువన్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో,  న్యాయ వర్గాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హఠాత్తుగా ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హఠాత్తుగా రంగానికి దిగి తనిఖీలు చేపట్టడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 2019 మార్చి నెలలో జరిగిన వైఎస్ వివేకా  హత్య ఉదంతంలో ఇప్పటివరకు  సిబిఐ విచారణ జరుపుతుండగా, ఉన్నట్టుండి ఈడీ అధికారులు రంగప్రవేశం చేయడం వెనుక ఉన్న కారణాలపై విశ్లేషకులు మరియు సామాన్య ప్రజలు ఆసక్తికరమైన చర్చలకు తెరలేపారు.

ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భాగంగా పలు కీలకమైన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిందితులు, సాక్షులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తుల ఇళ్లలో జరిపిన శోధనలలో  24 లక్షల రూపాయల నగదుతో పాటు అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. అయితే హత్య జరిగిన  ఏడేళ్ల తరువాత నిందితుల ఇళ్లలో కీలక డాక్యుమెంట్లు ఉంటాయా? సంఘటన జరిగిన గంటల వ్యవధిలో సాక్ష్యాలను తారుమారు చేస్తున్న నేటి పరిస్థితుల్లో హత్య జరిగిన ఏడేళ్ల తరువాత కీలక పత్రాల స్వాధీనం అంటూ వస్తున్న వార్తలు నమ్మశక్యంగా లేవని వీవీరావు విశ్లేషించారు. 

ఈ తనిఖీల వెనుక కేవలం హత్య కేసు విచారణ మాత్రమే  లేదన్నారు. అయినా ఈడీ వంటి దర్యాప్తు సంస్థల తనిఖీలు రానున్న రోజులలో జరగనున్న రాజకీయ పరిణామాలకు తార్కాణమని గత అనుభవాలను బట్టి  అవగతం చేసుకోవచ్చునన్నారు. ఇప్పుడు ఈడీ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవలే జగన్ హయాంలో ఏపీలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి ఒడిషాలో కాంగ్రెస్ గూటికి చేరడం... రానున్న రోజుల్లో జగన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఎందుకంటే.. ఏడేళ్ల తరువాత ఇప్పుడు ఈడీ ఈ కేసులో అవినాష్ రెడ్డి తదితరుల నివాసాలలో ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. రానున్న రోజులలో జరగబోయే పరిణామాలేమిటన్నది వేచి చూడాలన్నారు.  

Jagan to join Congress, YS Viveka Case ED Raids, YS Vivekananda Reddy Murder Case, ED Investigation, Avinash Reddy ED Raids, TeluguOne