కంగ్రాట్స్ టీమ్ సీబీఎన్ అంటూ ట్వీట్: పుర పోరులో ఓటమిపై జగన్ అక్కసు.!
Published on: Wed Nov 4, 2026 9:52AM

పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతంలో చేసిన విమర్శలే చేస్తూ.. అదే తప్పును పునరావృతం చేస్తున్నారు. పార్టీ పరాజయానికి కారణాలు, క్యాడర్ లో భరోసా నింపడంలో తన వైఫల్యాలపై ఆత్మ విమర్శ చేసుకోవడం, పార్టీ తీరుపై సమీక్షలు నిర్వహించడం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి హవా స్పష్టంగా కనిపించింది. ప్రతిచోటా అధికార పక్షం వైపే ఓటర్లు మొగ్గు చూపడంతో వైకాపాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ భారీ పరాభవంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్ జగన్... సోషల్ మీడియా వేదికగా తన అక్కసును వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసులు, ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ప్రతిపక్షం పోటీ చేసే అవకాశమే ఇవ్వకుండా ఎన్నికల్లో అద్భుతంగా గెలవడం ఎలాగో మీరు నిరూపించారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో జరిగినవి ఎన్నికలు కాదని సెలెక్షన్స్ అనీ జగన్ ఆరోపించారు.
అధికార పార్టీ మరియు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా విమర్శలు చేయడం ద్వారా, ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాతీర్పును గౌరవించకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్న విషయాన్ని చాటుతున్నాయంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని తప్పులను సరిదిద్దుకునే దిశగా వైకాపా అధినాయకత్వం అడుగులు వేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే వైఖరిని కనుక కొనసాగిస్తే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.
ప్రజల నుంచి వచ్చిన స్పష్టమైన తీర్పును అంగీకరించి ఆత్మసమీక్ష చేసుకోవడానికి బదులుగా, నిందలు మోపి, పరాజయానికి నెపం తెలుగుదేశం పార్టీపైనా, ఎన్నికల సంఘంపైనా నెట్టేయడం సరి కాదంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించి, ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడితేనే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని లేకపోతే పార్టీ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.
[Jagan Reaction On Defeat, Municipal polls, AP Local Body Election Results, Team CBN Tweet, AP politics, Telugu One]


