జగన్ పాదయాత్ర ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచంటే?
Published on: Fri Sep 4, 2026 5:53PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత తన పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2029 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడమనే ఏకైక లక్ష్యంతో ఆయన చేపట్టబోతున్న పాదయాత్ర వచ్చే ఏడాది జులైలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ప్రారంభించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పాదయాత్ర కోసం ఇప్పటి నుంచే గ్రౌడ్ వర్క్ మొదలు పెట్టనున్నారు.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనంతో మమేకమై అధికార పగ్గాలు చేపట్టిన జగన్ అధికారం చేజిక్కిన తరువాత జనానికి ముఖం చాటేశారు. రోడ్లకు ఇరు వైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటనలు సాగించారు.

అలాగే పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వాగ్దానాల అమలు అటుంచి, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కూడా పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో ఈసారి జగన్ పాదాయత్రకు రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయి. గతంలో 2019 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని సంపాదించుకున్నప్పటికీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కొన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని వైసీపీయులే చెబుతున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం.. 2017లో పాదయాత్రకు లభించిన ప్రాజాదరణ ఈ సారి అనుమానమేనని విశ్లేషిస్తున్నారు.
అది పక్కన పెడితే.. సెంటిమెంట్ ప్రకారం వైయస్ఆర్ జయంతి నాడే యాత్రను ప్రారంభించడం ప్రజలకు దగ్గర కావడానికి, వారి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి దోహదపడుతుందని జగన్ విశ్వసిన్తున్నారు. వచ్చే ఏడాదిజులై నుంచి జగన్ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడకపోయినా.. పార్టీ వర్గాలు మాత్రం పాదయాత్రకు అదే ముహూర్తం ఖారరైందని గట్టిగా చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్ల కాలంలో పెద్దగా జనంలోకి వచ్చిన దాఖలాలు లేవు.
జగన్ కూడా చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వినా.. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. ఇక ఒకరిద్దరు వినా పార్టీ నేతలు కూడా పొలిటికల్గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలంటే.. పాదయాత్ర వినా మరో మార్గం లేదని జగన్ భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఎన్నికలకు రెండేళ్లు ముందే పాదయాత్ర చేపట్టడం ద్వారా నిరంతరం జనంలో ఉండేలా పాదయాత్రను ఎంచుకున్నారు.
[Jagan Padayatra From July 2027, jagan padayatra 2.0, ys jagan mohan reddy, ap politics, ysr jayanthi,, andhra pradesh News, Telugu One]


