ఎన్నికలైన వెంటనే విదేశాలకు జగన్.. దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల యుద్ధంలో ఓటమి ఖరారైందన్న నిర్ణయానికి వచ్చి అస్త్ర సన్యాసం చేసేశారా? ఎన్నికలు నాలుగు రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. పోటీలో ఉన్న ప్రతి పార్టీ, ప్రతి నాయకుడూ.. ఈ నాలుగు రోజులూ విశ్రాంతి గురించి ఆలోచించకుండా ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. సాధ్యమైనంత మందిని కలిసి ఓటు అభ్యర్థించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇతరత్రా విషయాలను అసలు పట్టించుకోరు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారం మధ్యలో విరామం తీసుకుంటున్నారు. ఎవరినీ కలవకుండా, పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేయకుండా పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమౌతున్నారు. ఈ నెలలో ఇప్పటికే మూడు రోజులు ప్రచారం జోలికి వెళ్లకుండా ప్యాలెస్ కు పరిమితమైపోయారు. ఔను ఈ నెల 2, 3, 8 తేదీలలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. పోనీ ఎండల్లో తిరగడం వల్ల వచ్చిన అస్వస్థతతో విశ్రాంతి తీసుకున్నారా అంటే అలాంటి సంకేతాలేమీ లేవు. ఎన్నికల ప్రచారం కంటే ముఖ్యమైన పనులేవో ఆయన చక్కబెట్టుకుంటున్నారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. 

అందుకు కారణాలు లేకపోలేదు. కొన్ని రోజుల కిందట.. తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద సీఐడీ సిబ్బంది కీలక ప త్రాలను దగ్ధం చేసిన సంగతి తెలసింది. జగన్ అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరించే సీఐడీ చీఫ్ రఘురామరెడ్డి ఆదేశాల మేరకే ఆ పత్రాల దగ్ధం జరిగిందని స్వయంగా సిట్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. నాడు దగ్ధం చేసిన పత్రాలలో హెరిటేజ్ కు చెందిన కీలక పత్రాలు, అలాగే చంద్రబాబు స్కిల్ కేసుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పత్రాల దగ్ధం సమయంలో ఫొటోలు, వీడియోలు తీసిన కొందరిని ఆ వీడియోలు, పొటోలు తమకు ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు ఒత్తిడి చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చింది. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ను అధికారులు చట్ట విరుద్ధంగా పొందారని, వాటినే  దగ్ధం చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినవచ్చాయి. అంటే అప్పటికే రాష్ట్రంలో ప్రజల మూడ్ వైసీపీకి వ్యతిరేకంగా ఉందనీ, ఎన్నికలలో ఓటమి ఖాయమనీ వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చేసి.. ఆ పత్రాల దగ్ధానికి సీఐడీ చీఫ్ ను పురిగొల్పి ఉంటుందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.

 అంతే కాకుండా ఎన్నికలలో వైసీపీ పరాజయం ఖాయమనీ, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం తథ్యమని భావిస్తున్న వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారులు ఇప్పుడు సర్దుకునే పనిలో పడ్డారనీ అప్పట్లో గట్టిగా వినిపించింది. ఇప్పుడు సిట్ కార్యాలయంలో పత్రాలు దగ్ధం సంఘటన జరిగిన నెల రోజులకు జగన్ ప్రచారంలో తరచూ విరామం తీసుకుంటూ.. ప్యాలెస్ లో చేస్తున్న మంత్రాంగంపైనా అటువంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఓటమి ఎటూ తప్పదు.. కనీసం తప్పులు దొరకకుండా తప్పించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై ఆయన ప్యాలెస్ లో మంత్రాంగం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా మే 13న పోలింగ్ జరుగుతుంది. సరిగ్గా నాలుగు రోజుల తరువాత జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నారు. భార్య భారతితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టును అభ్యర్థిస్తూ  పిటిషన్ దాఖలు చేసుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్, స్విట్జర్ ల్యాండ్, ఫ్రాన్స్ లో పర్యటించనున్నట్లు తెలిపారు.  ఏపీలో పోలింగ్ పూర్తయిన వెంటనే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ విదేశీ పర్యటన అభ్యర్థనపై సీబీఐ కోర్టు గురువారం (మే9) విచారించనుంది.

ఓటమి భయంతో జగన్ కేసుల నుంచి బయటపడేందుకు ఏపీ వదిలి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయనకు స్వయానా సోదరి షర్మిల ఇప్పటికే ఆరోపించారు. అంతే కాకుండా వివేకా హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి కూడా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారనీ, ఈ ఎన్నికలలో ఓటమి పాలైతే అరెస్టు తథ్యమనే భయంతోనే ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారనీ ఆరోపించారు. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే పీక్ టైంలో ప్రచారాన్ని సైతం వదిలేసి జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో చేస్తున్న మంత్రాంగంపై అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.