TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అక్రమాస్తుల కేసులో ఈడీ పిటిషన్.. వ్యక్తిగత హాజరు మినహాయింపు దక్కేనా?

Published on: Sun Oct 11, 2026 11:40AM

జగన్ అక్రమాస్తుల కేసులో తాజాగా ఈడీ తెలంగాణ హైకోర్టులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ తో  వైసీపీ అధినేతకు చిక్కులు తప్పవని అంటున్నారు. ఈడీ పిటిషన్ జగన్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాక తప్పని పరిస్థితి కల్పిస్తుందని అంచనావేస్తున్నారు. ఇదే కేసులో సీబీఐ కేసులు కొలిక్కి వచ్చేదెన్నడో తెలియకపోయినా, ఈడీ దాఖలు చేసిన రిట్ లో ఈ కేసుల రోజు వారీ విచారణ ప్రారంభమయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.

అదే జరిగితే..  జగన్ కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించడం ఖాయమని అంటున్నారు.  సీబీఐ సాధారణ క్రిమినల్ చట్టాల కింద పనిచేస్తే.. ఈడీ అత్యంత కఠినమైన మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నేరుగా ఆర్థిక నేరాలను డీల్ చేస్తుంది. అందుకే సీబీఐ కేసులతో పోలిస్తే ఈడీ కేసులలో   చట్టపరమైన బాధ్యత పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సాధారణ న్యాయ సూత్రాల ప్రకారం నేరం జరిగినట్లు దర్యాప్తు సంస్థ నిరూపించాల్సి ఉండగా,ఈడీ  పీఎంఎల్ఏ  తాను తప్పు చేయలేదని నిందితుడే కోర్టులో నిరూపించుకోవలసి ఉంటుంది.  అంటే ఇప్పుడు జగన్ తన కంపెనీల్లోకి వరదలా పారిన సొమ్ములు సక్రమమైనవేనని   నిరూపించుకోవాల్సి ఉంటుంది.

అరబిందో, హెటెరో, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌లో వాస్తవ విలువల కంటే అధిక ప్రీమియంతో జరిగిన షేర్ల కొనుగోళ్లు, బ్యాంకింగ్ లావాదేవీలు, మనీ ట్రయిల్ ఆధారాలు ఈడీ వద్ద   పక్కాగా ఉన్న నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ ట్రయల్ ఆరంభమైతే.. జగన్ కు చుక్కలు కనిపించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. . సీబీఐ కేసుల్లో సాక్షుల వాంగ్మూలాలు, వారి విశ్వసనీయతపై ఆధారపడాల్సి వస్తే.. ఈడీ కేసుల్లో డాక్యుమెంటరీ సాక్ష్యాలు, డిజిటల్ లెడ్జర్లు, బ్యాంక్ రికార్డులే ప్రధానం. అందువల్ల ఈడీ కేసుల్లో తప్పించుకోవడం జగన్‌కు అంత తేలిక కాదని చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో జగన్ విచారణను జాప్యం చేసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని, ఇందు కోసం  సీబీఐ మోపిన   నేరం తేలకుండా, ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులపై విచారణ జరపడం సరికాదని జగన్  సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందంటున్నారు. సీబీఐ కోర్టులో అసలు అవినీతి జరిగిందా లేదా అన్నది తేలేవరకు ఈడీ విచారణను నిలిపివేయాలనీ లేదా, సీబీఐ, ఈడీ కేసుల విచారణ ఏకకాలంలో జరగాలని కోరుతూ జగన్ పిటషన్లు వేసే అవకాశాలున్నాయంటున్నారు.  

అయితే.. ఇప్పటికే ఏళ్ల తరబడి విచారణను అడ్డుకుంటున్న డిశ్చార్జ్ పిటిషన్ల ప్రక్రియను మరింత సాగదీయడం అంత తేలిక కాదన్న వాదనా వినిపిస్తోంది. అయితే . ఈడీ దాఖలు చేసిన తొమ్మిది ప్రాసిక్యూషన్ ఫిర్యాదులలో నిందితులుగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు, బ్యూరోక్రాట్లు, ఇతర సహ నిందితులు వేసిన డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వీటిపై కింది కోర్టు తుది నిర్ణయం తీసుకోకుండా రోజువారీ విచారణ ఎలా ప్రారంభిచడం తగదని జగన్ వాదించే అవకాశాలున్నాయని,   ఒకవేళ ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేస్తే.. వెంటనే హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం ద్వారా విచారణను సాధ్యమైనంత వరకూ వాయిదాల కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయంటున్నారు.  

 అలాగే.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం కూడా జగన్ కోర్టులను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.   తాను ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధినేతనని, ప్రజా సమస్యలపై పోరాడాల్సి ఉందని, ఇంకా భద్రతా కారణాలు, రాజకీయ షెడ్యూళ్లు చూపిస్తూ..  మినహాయింపు కోరే అవకాశం ఉంది. అయితే, సుప్రీంకోర్టు గతంలోనే ఆర్థిక నేరస్థుల విషయంలో ఆర్టికల్ 21 కింద సత్వర న్యాయ విచారణ అవసరమని స్పష్టం చేసినందున .. జగన్ ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయన్నది సందేహమే.  ఏది ఏమైనా, రోజువారీ విచారణ ప్రారంభమైతే మాత్రంజగన్ కు చిక్కులు తప్పవని న్యాయనిపుణులు అంటున్నారు.  

[Jagan, In Appropriate Cases, ED Cases, PMLA Trial, CBI Court, Regular Hearing, Telugu One]