TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉద్యోగాల పేరుతో యువతులకు వల.. ఐవీఎఫ్ కేంద్రాల అండాల దందా గుట్టురట్టు.!

Published on: Tue Nov 10, 2026 5:05PM

ఉద్యోగం.. మంచి జీతం.. ఉచిత వసతి.. ఇవన్నీ ఆశ చూపించి యువతులను హైదరాబాద్‌కు రప్పించడం.. ఆ తర్వాత వారి నుంచి అండాలను సేకరించడం! ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్ల ముసుగులో సాగుతున్న అక్రమ అండాల సేకరణ వ్యవహారం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఉపాధి కోసం నగరానికి వచ్చే యువతులే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు మహిళా కమిషన్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. నకిలీ ఆధార్ కార్డుల తయారీ వ్యవహారంలో ప్రవీణ్ అనే వ్యక్తిని బేగంపేట పోలీసులు అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.

ఉద్యోగాల ఆశ చూపి.. అండాల సేకరణకు వల.!

ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చే యువతులను లక్ష్యంగా చేసుకుని కొందరు ముఠా సభ్యులు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం, ఉచిత వసతి కల్పిస్తామంటూ ఇతర ప్రాంతాల నుంచి యువతులను నగరానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో ఆశ్రయం కల్పించి, అండాల సేకరణకు ఒప్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులే హాస్టళ్లను నిర్వహిస్తూ, వాటిని ఈ వ్యవహారానికి వేదికలుగా ఉపయోగించుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో యువతి నుంచి పలుమార్లు అండాలను సేకరిస్తున్నారన్న ఆరోపణలు వారి ఆరోగ్య భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

హాస్టళ్ల ముసుగులో అక్రమ దందా.!

సరూర్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు యువతులను గుర్తించి రక్షించారు. బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌లో ఉన్న మరో అపార్ట్‌మెంట్‌లోనూ యువతులను గుర్తించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆశ్రయ కేంద్రాలకు తరలించారు. ఈ కేసులో దుర్గాప్రసాద్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి యువతులను హైదరాబాద్‌కు తీసుకొస్తున్న నెట్‌వర్క్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

నకిలీ ఆధార్‌లతో అసలు వివరాలకు మసి.!

ఈ అక్రమ వ్యవహారంలో నకిలీ ఆధార్ కార్డుల వినియోగం కీలకంగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అండాల సేకరణకు సంబంధించిన దాతల వివరాలను నిబంధనల ప్రకారం ART అధికారులకు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, కొందరు కేంద్రాలు యువతుల అసలు వివరాలను దాచిపెట్టి, చిరునామాలు, ఇతర వ్యక్తిగత వివరాలు మార్చిన ఆధార్ కార్డులను సమర్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ప్రవీణ్‌ను బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఏయే ఫెర్టిలిటీ కేంద్రాలతో సంబంధాలున్నాయి? నకిలీ పత్రాల తయారీ వెనుక ఇంకా ఎవరున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మహిళా కమిషన్ సీరియస్.. ఐదు కేంద్రాల ప్రతినిధులకు విచారణ.!

ఈ వ్యవహారాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ కూడా తీవ్రంగా పరిగణించింది. నవంబర్ 9న బుద్ధభవన్‌లోని కమిషన్ కార్యాలయంలో ఐదు ఫెర్టిలిటీ కేంద్రాల ప్రతినిధుల నుంచి వివరణ తీసుకుంది. ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఓయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు ART, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాల ప్రతినిధులను విచారించింది. అయితే, కేంద్రాల ప్రధాన నిర్వాహకులు స్వయంగా హాజరుకాకుండా సిబ్బందిని పంపడంపై కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్ 13న ప్రధాన నిర్వాహకులు వ్యక్తిగతంగా హాజరై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత కేంద్రాల అనుమతులు రద్దు చేయాలని వైద్యశాఖకు సూచించారు.

50 మంది మహిళల వాంగ్మూలాలు.. వెలుగులోకి కీలక అంశాలు.!

ఈ వ్యవహారంలో సుమారు 50 మంది మహిళలతో మాట్లాడినట్లు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వెల్లడించారు. ఉద్యోగాలు, డబ్బు ఆశ చూపించి అండాల దానానికి ఒప్పించినట్లు పలువురు మహిళలు వివరించారని తెలిపారు. కొందరి ఆధార్ వివరాలు, వయస్సుల్లోనూ మార్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ వివరాల ఆధారంగా అక్రమాల తీవ్రత, బాధితుల సంఖ్య, సంబంధిత కేంద్రాల పాత్రపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మొత్తం 20 ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు.!

మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. నిబంధనల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో మొత్తం 20 ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వీటిలో నోవా, బటర్‌ఫ్లై, ఇందిరా, నర్మదా, బిర్లా, అన్వి, కాంశివ, మర్రి తులసి రెడ్డి, 49 ఫెర్టిలిటీ, మమత, సద్గురు ART, ఫాతిమా, ఆరాధ్య తదితర కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. అండాల సేకరణకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? దాతల వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేస్తున్నారా? ART చట్ట నిబంధనలను పాటిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు వివరణ కోరుతున్నారు.

గుజరాత్ టు హైదరాబాద్.. అంతర్రాష్ట్ర ముఠా లింకులపై ఆరా.!

ఈ అక్రమ వ్యవహారంలో గుజరాత్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతులను నగరానికి తీసుకురావడం నుంచి అండాల సేకరణ, ఫెర్టిలిటీ కేంద్రాలతో సంబంధాలు కొనసాగించడం వరకు ఈ నెట్‌వర్క్‌ను ఎవరు నడిపిస్తున్నారు? హాస్టళ్ల నిర్వాహకులు, మధ్యవర్తులు, వైద్య సిబ్బంది పాత్ర ఎంత? నకిలీ ఆధార్ కార్డుల తయారీకి సహకరించిన వారెవరు? ఇప్పటికే ఎంతమంది యువతులు ఈ వలలో చిక్కుకున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.

ఉపాధి కోసం నగరానికి వచ్చిన యువతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అక్రమ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఎన్ని ఫెర్టిలిటీ కేంద్రాలకు ఈ వ్యవహారంతో సంబంధాలున్నాయి? పోలీసుల విచారణలో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో చూడాలి.

ఇది కూడా చదవండి: తనపై ఆరోపణల వెనుక కుట్ర ఉంది.. డీజీపీని ఆశ్రయించిన వీసీ జానయ్య.!

 

[ IVF Centres Hyderabad, Illegal Egg Donation, Fertility Centres, Malkajgiri Police, Telangana Women Commission, Fake Aadhaar Cards, ART Rules, Hyderabad News, Telugu News, Telugu One]