రకుల్ ప్రీత్ సింగ్ ఇంటిపై ఈడీ దాడులు.!
Published on: Mon Sep 28, 2026 3:47PM

బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది. సినీ నిర్మాణాలు, ఆర్థిక లావాదేవీలు, విదేశాలకు నిధుల మళ్లింపు, పన్ను ఎగవేతకు సంబంధించిన అనుమానాల నేపథ్యంలో ముంబైలో ఐటీ అధికారులు భారీ స్థాయిలో సోదాలు చేపట్టారు. మొత్తం 12 ప్రాంతాల్లో ఐటీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఈ సోదాల్లో బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీతో పాటు పానోరమా స్టూడియోస్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు ఉన్నట్లు సమాచారం. వేర్వేరు బృందాలుగా విడిపోయిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు.
సినిమా షూటింగ్‌లు, నిర్మాణ వ్యయాలు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో నిధులను విదేశాలకు మళ్లించారనే ఆరోపణలు, పన్ను సంబంధిత అవకతవకలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమా ప్రాజెక్టులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నానీకి చెందిన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై ఆయన పలు చిత్రాలను నిర్మించారు. ఆయా సినిమా ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల వ్యవహారాలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.అలాగే ‘దృశ్యం’ ఫ్రాంచైజీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పానోరమా స్టూడియోస్‌కు సంబంధించిన ప్రాంతాల్లోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. సినిమా నిర్మాణం, పంపిణీ, విదేశీ లావాదేవీలకు సంబంధించిన ఆర్థిక వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ప్రముఖ సినీ నటి, నిర్మాత, నిర్మాణ సంస్థలకు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరగడంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత ఐటీ శాఖ నుంచి మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
[ IT raids Rakul Preet Singhs house, Bollywood, Producer Vasu Bhagnani, Pooja Entertainment' banner, Panorama Studios, Bollywood IT Search, Illegal Fund Transfer Allegation,Telugu One, Telugu News ]


