ఇరుముడి మూవీపై టీచర్ల ఆగ్రహం..అభ్యంతరకర సీన్లు తొలగించాలని డిమాండ్..!
Published on: Tue Aug 25, 2026 8:22PM

ఉపాధ్యాయ వర్గానికి క్షమాపణ చెప్పాలన్న APTF..!
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ.. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదానికి దారితీశాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల ప్రతిష్టను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (APTF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరుతో చిత్రీకరించిన సన్నివేశాల్లో పాఠశాల భవనం, విద్యార్థుల యూనిఫాం తదితర అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని APTF నేతలు పేర్కొన్నారు.
సినిమాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి పాత్రను ప్రతికూలంగా చూపించడం వల్ల మొత్తం ఉపాధ్యాయ వర్గం గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా సమాజంపై ప్రభావం చూపించే శక్తివంతమైన మాధ్యమమని, ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంబంధించిన సున్నితమైన అంశాలను చిత్రీకరించేటప్పుడు దర్శక నిర్మాతలు బాధ్యతగా వ్యవహరించాలని APTF అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల వృత్తిని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రతిష్టను కించపరిచేలా ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని APTF డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఉపాధ్యాయ వర్గానికి క్షమాపణలు చెప్పాలని కోరింది. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళనలు చేపడతామని సంఘం హెచ్చరించింది.ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమా చుట్టూ నెలకొన్న ఈ వివాదంపై చిత్రబృందం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.
Irumudi Movie, APTF, Alluri District, Seeleru, Objectionable scenes, Komaram, Nagulu Character, Komaraka, Ravi teja


