TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

IRDAI సంచలన నిర్ణయం: మిస్-సెల్లింగ్ ఏజెంట్లకు షాక్.. కమిషన్ రికవరీ!

Published on: Fri Sep 25, 2026 11:02AM

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో ఏజెంట్ చెప్పిన మాటలు విని, తీరా డబ్బులు చెల్లించాక మోసపోయామని తెలుసుకునే సందర్భాలు మన దేశంలో ఎన్నో చూస్తూనే ఉంటాం. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఎండోమెంట్ పాలసీలు కట్టించడం, లేదా సింగిల్ ప్రీమియం అని చెప్పి రెగ్యులర్ ప్రీమియం పాలసీలు అంటగట్టడం లాంటి మిస్-సెల్లింగ్ అక్రమాలకు స్వస్తి పలకడానికి భారత ఇన్సూరెన్స్ నియంత్రణ మండలి (IRDAI) అత్యంత సంచలనాత్మక సంస్కరణలను ప్రతిపాదించింది. వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా తెచ్చిన ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఎవరైనా ఏజెంట్ లేదా సంస్థ తప్పుదోవ పట్టించి ఇన్సూరెన్స్ పాలసీని అమ్మినట్లు (మిస్-సెల్లింగ్) రుజువైతే, ఆ ఏజెంట్ లేదా డిస్ట్రిబ్యూటర్ నుంచి చెల్లించిన కమిషన్‌ను పూర్తిగా వెనక్కి తీసుకునే (కమిషన్ క్లాబ్యాక్ - Commission Clawback) కఠిన విధానాన్ని తీసుకురాబోతున్నారు. దీనివల్ల ఇకపై ఏజెంట్లు కేవలం తమ సేల్స్ టార్గెట్ల కోసం కస్టమర్లను అబద్ధాలతో బురిడీ కొట్టించడం సాధ్యపడదు.

ఈ కొత్త సంస్కరణలు కేవలం కమిషన్ క్లాబ్యాక్‌కే పరిమితం కాలేదు; డిస్ట్రిబ్యూషన్ రంగంలో పారదర్శకత పెంచడానికి విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2025లో (FY25) లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు దాదాపు రూ. 60,800 కోట్ల కమిషన్లు చెల్లించాయి, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 18 శాతం పెరుగుదల. కానీ, ఇదే సమయంలో ప్రీమియం గ్రోత్ కేవలం 6.73 శాతంగానే నమోదు కావడంతో, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని IRDAI గుర్తించింది. ఈ ఖర్చుల భారమంతా చివరికి పాలసీదారులపైనే పడుతోంది. అందుకే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఎక్స్‌పెన్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (EoM) పరిమితిని ప్రస్తుతం ఉన్న 30 శాతం గ్రాస్ రిటన్ ప్రీమియం (GWP) నుంచి రాబోయే ఐదేళ్లలో 20 శాతం domestic GDPIకి క్రమంగా తగ్గించాలని ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. అలాగే లైఫ్ ఇన్సూరర్ల ఈవోఎమ్ పరిమితిని 12.5 శాతానికి ప్రతిపాదించింది.

పాలసీలను విక్రయించేటప్పుడు ఏజెంట్లు మరియు బ్యాంక్, ఎన్‌బిఎఫ్‌సి ఉద్యోగులు కస్టమర్ల నిజమైన అవసరాలను అంచనా వేయడం (కస్టమర్ సూటబిలిటీ) ని తప్పనిసరి చేయనున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో తీసుకునే పాలసీలకు డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్, ప్రాపర్ ఆడిట్ ట్రయల్ ఉండాల్సిందే. కేవలం కస్టమర్ సంతకం తీసుకున్నంత మాత్రాన ఏజెంట్ తన బాధ్యత నుండి తప్పుకోలేరు. అంతేకాకుండా, విదేశీ పర్యటనలు, లగ్జరీ గిఫ్ట్‌లు, మైలురాయి బోనస్‌లు, కంటెస్ట్ రివార్డ్‌లు వంటి వాల్యూమ్-లింక్డ్ సేల్స్ ఇన్సెంటివ్‌లపై నిషేధం విధించాలని IRDAI భావిస్తోంది. బ్యాంకుల్లో లోన్లు తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ బలవంతంగా అంటగట్టే విధానానికి (కంపల్సరీ బండ్లింగ్) చెక్ పెట్టడమే కాకుండా, వెబ్‌సైట్లలో కస్టమర్ల వ్యక్తిగత వివరాలు తీసుకోకుండానే ప్రొడక్ట్ వివరాలు, ధరలు స్పష్టంగా చూపేలా 'డార్క్ ప్యాటర్న్స్'ను అరికట్టాలని ఆదేశించింది.

ఇన్సూరెన్స్ విక్రయించిన ప్రతి ఏజెంట్ ఐడెంటిటీని పాలసీతో లింక్ చేయడంతో పాటు, మిస్-సెల్లింగ్ చేసిన వారి రికార్డులను పబ్లిక్ డొమైన్ ('పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ') లో ఉంచనున్నారు. దీనివల్ల కస్టమర్లు పాలసీ తీసుకునే ముందే ఆ ఏజెంట్ ట్రాక్ రికార్డ్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణ మోటార్ వాహన ఇన్సూరెన్స్ విభాగంలో సగటు కమిషన్ 24 శాతంగా ఉండి, FY25లో OEM బ్రోకర్లు రూ. 29,000 కోట్ల ప్రీమియంపై దాదాపు రూ. 7,050 కోట్ల కమిషన్ పొందారని, ఇది ఇన్సూరెన్స్ ధరకు కారణమవుతోందని పేర్కొంటూ థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌పై డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు సున్నా కమిషన్, ఏజెంట్లకు గరిష్టంగా 2.5 శాతం మాత్రమే పరిమితం చేసే యోచనలో ఉంది. సులభమైన బిమా సుగమ్ (Bima Sugam) డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మధ్యవర్తులు లేకుండా నేరుగా తక్కువ ధరకే పాలసీలు కొనుగోలు చేసే అవకాశం కూడా రాబోతోంది. వినియోగదారులకు మరింత మెరుగైన రక్షణ కల్పిస్తూ తెస్తున్న ఈ కీలక ప్రతిపాదనలపై అక్టోబర్ 25, 2026 వరకు భాగస్వాముల నుంచి అభిప్రాయాలను IRDAI ఆహ్వానించింది.

 

 

 

[IRDAI, Insurance Mis-Selling, Commission Clawback, Insurance Agents, Life Insurance, General Insurance, Customer Suitability, Public Insurance Registry, Bima Sugam, Motor Insurance]