TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇరాన్ అధీనంలో అమెరికా సబ్ మెరైన్.!

Published on: Wed Sep 9, 2026 10:33AM

ఇరాన్ తో యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు భారీ షాక్ తగిలింది.  ఆ దేశ నౌకాదళానికి చెందిన మానవ రహిత అండర్‌ వాటర్ సబ్‌మెరైన్ ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది.  ఈ మేరకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) అధికారికంగా ప్రకటించింది.  బుధవారం (సెప్టెంబర్ 9) తెల్లవారుజామున అత్యంత పకడ్బందీగా నిర్వహించిన  ఇంటెలిజెన్స్  ఆపరేషన్ ద్వారా  అమెరికన్ మానవ రహిత సబ్ మెరేన్ ను తమ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

 ప్రపంచ ఇంధన రవాణాకు  కీలకమైన ఈ జలసంధిలో జరిగిన ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో కలకలం రేపింది. ఇరాన్   సమాచారం ప్రకారం, ఈ సబ్ మెరైన్ అమెరికా రక్షణ సంస్థ  అండూరిల్ ఇండస్ట్రీస్ తయారు చేసిన  డైవ్-ఎల్డీ రకానికి చెందిన లార్జ్ డిస్‌ప్లేస్‌మెంట్ అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ (ఏయూవీ)గా గుర్తించారు. దాదాపు 3 టన్నుల బరువు,  సుమారు 5.8 మీటర్లు  అంటే 19 అడుగుల పొడవు,  4 అడుగుల వెడల్పు కలిగిన ఈ  సబ్ మెరైన్ అద్భుత సామర్థ్యాలను కలిగి ఉంది. ఏకంగా 6వేల మీటర్ల  లోతు వరకు వెళ్లి పనిచేయగల ఈ సబ్ మెరైన్..  మానవ ప్రమేయం లేకుండా దాదాపు 10 రోజుల పాటు స్వయంప్రతిపత్తితో సముద్రం అడుగున సాగగలదు. 

2025లో  అమెరికా నౌకాదళం అమ్ములపొదిలోకి చేరిన ఈ సబ్ మెరైన్  నీటిగర్భ నిఘా, ఇంటెలిజెన్స్ సేకరణ, సముద్రపు గర్భ మ్యాపింగ్,  మైన్ కౌంటర్ మెషర్స్ వంటి   మిషన్ల కోసం ఉపయోగించబడుతోంది.  అయితే, ఈ ఘటనపై అమెరికా వైపు నుంచి భిన్నమైన వాదన వినిపిస్తోంది. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో సాధారణ కార్యకలాపాలకు మద్దతుగా సంచరిస్తున్న ఒక  సబ్ మెరైన్ సాంకేతిక లోపంతో మొరాయించిందని చెబుతోంది. ఎలాంటి సున్నితమైన లేదా క్లాసిఫైడ్ సోనార్, రాడార్ పరికరాలు లేని పాత మోడల్ సబ్ మెరైన్ అది అని పేర్కొన్న అమెరికా.. ఆ సబ్ మెరైన్ ఎలాంటి  సమాచారాన్ని సేకరించలేదని చెబుతోంది.  అయితే, ఇరాన్ మాత్రం దీనిని ఒక యుద్ధ ట్రోఫీగా భావిస్తూ, దీనికి సంబంధించిన ఫోటోలు  వీడియో క్లిప్‌లను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది.  


[Iran Seized America Submarine, Strait of Hormuz, US unmanned underwater vehicle, Anduril Dive LD, IRGC Navy, Middle East tension, Telugu One]