హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్? 

తెలంగాణ ప్రభుత్వంలో మరోసారి కీలక మార్పులు జరిగే సూచనలు కన్పిస్తున్నాయి. కీలకమైన పోస్టుల్లోని అధికారుల్లో మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే సీనియర్ ఐపీఎస్ లను మార్చింది తెలంగాణ సర్కార్. సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. కీలకమైన సైబరాబాద్ సీపీగా హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్న  స్టీఫెన్ రవీంద్రను అపాయింట్ చేసింది. ఇంటలిజెన్స్ ఐజీగా అనిల్ కుమార్ ను నియమించింది.  

ఐపీఎస్ ల్లో మరోసారి కీలక మార్పులు ఉంటాయనే చర్చ  సీఎంవోలో సాగుతోంది. హైదరాబాద్ సీపీని కూడా మారుస్తారని అంటున్నారు. హైదరాబాద్ సీపీగా ప్రస్తుతం అంజనీకుమార్ కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్ ను నియమిస్తారని తెలుస్తోంది. సీవీ ఆనంద్ ప్రస్తుతం  డిప్యూటేషన్‌పై సీఐఎస్ ఎఫ్ లో ఉన్నారు. 1991 బ్యాచ్ కు చెందిన సీవీ ఆనంద్ కు ఇటీవలే  అదనపు డీజీపీగా కేంద్రం ఎంప్యానెల్‌ చేసింది. గతంలో సైబరాబాద్ కమిషనర్ ను విభజించక ముందు సీపీగా పని చేశారు సీవీ ఆనంద్. సైబరాబాద్ ను రెండుగా విభజించిన తర్వాత ఆయనను హైదరాబాద్ సీపీగా నియమిస్తారనే ప్రచారం జరిగింది.

కాని సీవీ ఆనంద్ ను సివిల్ సప్లయ్ కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం.  కొంత కాలం  తర్వాత డిప్యూటేషన్ పై కేంద్రానికి వెళ్లారు. సీఐఎస్ ఎఫ్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఆయన తిరిగి రాష్ట్రానికి వస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు కేంద్రం నుంచి కూడా సిగ్నల్ వచ్చిందంటున్నారు. ఆయనను హైదరాబాద్ సీపీగా నియమించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని , త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు పక్కాగా చెబుతున్నాయి. 

హైదరాబాద్ ప్రస్తుత సీపీ అంజనీకుమార్ ఏపీ కేడర్ కు చెందిన వారు. దీంతో ఆయనను ఏపీకి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను కోరారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి డీవోపీటీ కసరత్తు చేస్తుందని, ఇందులో భాగంగానే సీవీ ఆనంద్ డిప్యూటేషన్ ను ముగించాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న ఇతర కేడర్ అధికారులను ఏం చేయాలన్న దానిపైనే డీవోపీటీ కసరత్తు చేస్తుందని అంటున్నారు. 
 
తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విషయంలోనూ కీలక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. విభజన సమయంలో సాంకేతికంగా సోమేష్ కుమార్ ఏపీ కేడర్ కు అలాట్ అయ్యారు. అయితే ఆయన క్యాట్ ఆర్డర్ పొంది తెలంగాణలో కొనసాగుతున్నారు. ఆయన  ఏకంగా సీఎస్ బాధ్యతలు చేపట్టారు.  సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాతో పాటు మరో పది మంది సీనియర్ ఐపీఎస్ లను పక్కన పెట్టి మరీ సోమేష్ కుమార్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు కేసీఆర్. అప్పుడే సీఎస్ గా సోమేష్ నియామకంపై విమర్శలు వచ్చాయి. తాజాగా డీవోపీటీ ఈ అంశంపై ఫోకస్ చేసిందని తెలుస్తోంది.