రూ.20 లక్షల బీమా కోసం.. కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.!
Published on: Sat Oct 3, 2026 5:31PM

భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే పక్కా ప్లాన్‌తో హత్య చేశాడు. అది కూడా ప్రమాదంగా కనిపించేలా పథకం వేసి మరీ ప్రాణాలు తీశాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడటంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ప్రయాస్ పాండే, కవితా చౌదరి మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. త్వరలో తమ జీవితంలోకి మరో అతిథి రాబోతున్నాడన్న ఆనందంలో ఉన్న సమయంలోనే కవితకు ఊహించని విషాదం ఎదురైంది. కవిత పేరిట ఉన్న రూ.20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులపై భర్త ప్రయాస్ కన్ను పడినట్లు పోలీసులు గుర్తించారు.
.webp)
భార్యను హత్య చేసి ఆ మొత్తాన్ని దక్కించుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం మరికొందరితో కలిసి పక్కా స్కెచ్ సిద్ధం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.పథకంలో భాగంగా కవితను స్కూటీపై బయటకు తీసుకెళ్లాడు. ముందుగా మాట్లాడుకున్న వ్యక్తులతో కలిసి ఓ లోడింగ్ ఆటోతో ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టించాడు. ఈ ప్రమాదంలో కవిత తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. తొలుత ఇది సాధారణ రోడ్డు ప్రమాదమేనని అందరూ భావించారు. అయితే.. పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అనుమానాలు మొదలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం కాదని తేలింది. ఎవరో కావాలనే ఈ ప్రమాదాన్ని సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో భర్త ప్రయాస్ పాండేపై అనుమానం బలపడింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

రూ.20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్యకు పథకం వేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.అయితే ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం.. కవిత గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే.. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా డబ్బు కోసం ప్రాణాలు తీశాడన్న విషయం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మిన భర్తే.. తన జీవితాన్ని ముగించినట్లు తెలుసుకున్న కవిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. డబ్బు కోసం ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఒకప్పుడు ప్రేమతో మొదలైన ఆ బంధం.. చివరకు రూ.20 లక్షల కోసం ఓ ప్రాణాన్ని బలిగొంది. నమ్మిన మనిషే నయవంచకుడిగా మారితే.. ఆ గాయం ఎంతటి విషాదాన్ని మిగుల్చుతుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
.webp)
[ Insurance Money Murder, Husband Kills Wife, Madhya Pradesh Crime, Jabalpur Crime, Pregnant Woman Murder, Insurance Murder Case, Husband Wife Crime, Love Marriage Murder, Madhya Pradesh Murder, Jabalpur Murder Case ]


