సరస్వతీదేవి అలంకరణలో బెజవాడ దుర్గమ్మ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.!
Published on: Fri Oct 16, 2026 11:02AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక శోభ తో అలరారుతూ సాగుతున్న దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 16) బెజవాడ దుర్గమ్మ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చచారు. దేవీ నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. కనకదుర్గమ్మ వివిధ అలంకారాలలో భక్తులను కటాక్షిస్తుండగా, భక్తి పారవశ్యంలో తేలిపోతున్న ప్రజలు తన్మయత్వంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
కాగా శుక్రవారం (అక్టోబర్ 16) సరస్వతీ అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్మించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. చేతిలో వీణ ధరించి, శ్వేత వర్ణ వస్త్రాలతో సర్వవిద్యా స్వరూపిణిగా సాక్షాత్కరించిన దుర్గమ్మను చూసి దర్శించుకుని తరిస్తున్నారు.
చదువుల తల్లి సరస్వతీ దర్శనంతో సకల విద్యాబుద్ధులు, జ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.అలాగే సరస్వతీ అలంకరణ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఆలయ మండపాలలో అర్చకులు వేదమంత్రాల నడుమ చిన్నారులకు అక్షర శ్రీకారం చుట్టించారు.
[Indrakeeladri Sarannavaratri utsavalu, Dasara, Kanaka Durga Temple, Saraswati Devi Alankaram, Vijayawada Durgamma, Telugu One]


