ఈ నెల 26 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ.!
Published on: Tue Nov 24, 2026 2:01PM

తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 26న నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలకు చీరలను కానుకగా అందించనున్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి మహిళలకు చీరలను పంపిణీ చేస్తోంది.
ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు కలిపి మొత్తం కోటి చీరలను అందించనుంది. మహిళల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో ఈ చీరలను ప్రత్యేకంగా రూపొందించారు. నాణ్యత, మన్నికకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలో ధరించేందుకు వీలుగా రెండు రకాల చీరలను సిద్ధం చేశారు.
ఇందులో 6.30 మీటర్ల పొడవుతో 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవుతో 5 లక్షల పాలీకాటన్ చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ చీరలను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నేత కార్మికులతోనే తయారు చేయించారు. మహిళలకు చీరలను కానుకగా అందించడంతో పాటు, స్థానిక నేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలందరూ చీరలు పొందేందుకు అర్హులు.
.webp)
జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం జరగనుంది.గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది చీరలను పంపిణీ చేస్తారు. అర్హులైన మహిళలు ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలను పొందవచ్చు. పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారు. దీని ద్వారా లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి చీరల పంపిణీని పర్యవేక్షించనున్నారు.
మీకు నచ్చవచ్చు: అటెండర్ మృతి.. KCR తీవ్ర విచారం.!
మీకు నచ్చవచ్చు: కార్తిక పౌర్ణమి: కిటకిటలాడుతున్న శివాలయాలు: తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ.!
[ Indiramma Sarees, Telangana Government, CM Revanth Reddy, Indiramma Mahila Shakti, One Crore Sarees, One Crore Women, Saree Distribution, Achampet, Nagarkurnool, Telangana Women, Free Sarees Scheme ]


