ఇండియా, అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం: మారిన సుంకాల లెక్కలు.. కీలక పరిణామాలు.!
Published on: Sat Nov 21, 2026 2:42PM

ఇండియా అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకటన దశలోనే నిలిచిపోయింది. ఇంకా సంతకం కాలేదు. నవంబర్ 18న కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్.. చట్టపరమైన బేరసారాలు పూర్తయ్యాయని, ఒప్పందం తుది దశలో ఉందనీ పేర్కొన్నారు. అయితే అమెరికా కొత్త సుంకాల నిర్మాణాన్ని ప్రకటించి సెక్షన్ 301 విచారణలను ముగించే వరకు సంతకం జరిగే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఫిబ్రవరిలో ప్రకటించిన ఒప్పందంలో 18 శాతం పరస్పర సుంకం గురించి ప్రస్తావించినప్పటికీ, ప్రస్తుతం చాలావరకు భారత వస్తువులపై 10 శాతం అదనపు సుంకం మాత్రమే అమల్లో ఉండటంతో, ఈ దశలో ఒప్పందంపై సంతకం చేయడం భారత్‌కు అనుకూలమైన సమీకరణంగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇండియా, అమెరికా మద్య వాణిజ్య ఉద్రిక్తతలు కొత్తవేమీ కాదు. 2018 మార్చిలో అమెరికా సెక్షన్ 232 కింద ఉక్కు, అల్యూమినియంపై సుంకాలు విధించడం, 2019లో భారత్ ప్రతీకార సుంకాలు, డబ్ల్యూటీఓ ఫిర్యాదు, అలాగే అమెరికా జీఎస్పీ ప్రయోజనాలను రద్దు చేయడం (సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై సుంక మినహాయింపు తొలగింపు వంటి పరిణామాలకు కొనసాగింపుగా తాజా పరిస్థితులను చెప్పుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 13న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రారంభమై, ఏప్రిల్ 2025లో నిబంధనల పత్రంపై సంతకాలు జరిగిన తర్వాత సుంకాల విధానంలో వరుస మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 2025లో 26 శాతం సుంకం ప్రకటన, ఆ తర్వాత 90 రోజుల నిలిపివేత, జూలై, ఆగస్టు 2025లో 25 శాతం సుంకం, రష్యా చమురు కొనుగోళ్ల నేపథ్యంలో మరో 25 శాతం అదనపు సుంకంతో మొత్తం 50 శాతానికి చేరడం, ఫిబ్రవరి 2026లో 18 శాతానికి తగ్గింపు ప్రకటన, రష్యా చమురు సంబంధిత 25 శాతం సుంకం ఉపసంహరణ వంటి కీలక మలుపులు చోటుచేసుకున్నాయి.
ఫిబ్రవరి 20, 2026న అమెరికా సుప్రీంకోర్టు 6–3 మెజారిటీతో ఐఈఈపీఏ చట్టం కింద విధించిన సుంకాలను కొట్టివేయడంతో అమెరికా సుంకాల చట్టపరమైన నిర్మాణంలో కీలక మార్పు వచ్చింది. అనంతరం ఫిబ్రవరి 24న సెక్షన్ 122 కింద 150 రోజుల గరిష్ఠ పరిమితితో 10 శాతం తాత్కాలిక సుంకం వచ్చి, జూలై 24న దాని గడువు ముగిసింది. జూలై 2026లో సెక్షన్ 301 బలవంతపు కార్మిక' విచారణ ఫలితంగా భారత్‌పై 10 శాతం అదనపు సుంకం విధించారు. మరోవైపు సెప్టెంబర్ 18, 2026న అమల్లోకి వచ్చిన రష్యా, ఇరాన్ నిర్బంధ చట్టం ప్రకారం, రష్యా చమురు లేదా గ్యాస్‌ను అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకం విధించే అధికారం అధ్యక్షుడికి లభించింది; ఆగస్టు 2026 నాటికి భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా సుమారు 45 శాతంగా ఉంది. ఈ వాణిజ్య ఒప్పందంపై దేశీయంగా రాజకీయ, ఆర్థిక కోణాల్లో చర్చోపచర్చలు జరిగాయి. ప్రతిపక్షాలు ఒప్పంద నిబంధనలపై విమర్శలు గుప్పించగా, వ్యవసాయం, పాడి, పౌల్ట్రీ, కీలక పంటల రంగాలను రక్షించామని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ పార్లమెంటులో స్పష్టం చేశారు. పార్లమెంటరీ వాణిజ్య కమిటీ 2026 ఆగస్టు 6న సమర్పించిన నివేదికలో రత్నాలు, ఆభరణాల ఎగుమతుల తగ్గుదల, సముద్ర ఉత్పత్తులపై సుంకం, వస్త్ర రంగంలో పోటీ సవాళ్ల వంటి అంశాలను ప్రస్తావించింది.

అలాగే 2025–26లో అమెరికాకు భారత ఎగుమతులు 87.31 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా, 2026 జనవరి, సెప్టెంబర్ మధ్య అమెరికా భారత్ నుంచి చేసిన దిగుమతులు 76.88 బిలియన్ డాలర్లకు (గత ఏడాది ఇదే కాలంలో 80.85 బిలియన్ డాలర్లతో పోలిస్తే తగ్గుదల) చేరాయి. వాణిజ్య మార్కెట్ల వైవిధ్యీకరణ దిశగా భారత్ పలు చర్యలు చేపట్టింది. 2025 ఆగస్టు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 20కి పైగా దేశాల్లో పర్యటించగా, యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఐరోపా సంఘంతో చర్చలు జనవరి 27, 2026న ముగియగా, న్యూజిలాండ్‌తో ఒప్పందం ఏప్రిల్ 2026లో సంతకమై ఆమోద ప్రక్రియలో ఉంది.
ఇది కూడా చదవండి: అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందం.. కథ, కమామిషు!
ఈఎఫ్‌టీఏ ఒప్పందం అక్టోబర్ 2025 నుంచి అమల్లో ఉంది. అయినప్పటికీ అమెరికా ఇప్పటికీ భారత్‌కు అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా కొనసాగుతోంది. నవంబర్ 3, 2026 అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు సెనెట్, ప్రతినిధుల సభ రెండింటినీ గెలుచుకుని, జనవరి 2027లో కొత్త కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో వాణిజ్య విధానాలపై పర్యవేక్షణ, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.

సెక్షన్ 301 నిర్మాణాత్మక అధిక ఉత్పత్తి సామర్థ్యం విచారణలో సోలార్ మాడ్యూల్స్, ఉక్కు, పెట్రోకెమికల్స్ రంగాలపై వచ్చిన అంశాలను భారత్ తిరస్కరించి విచారణను రద్దు చేయాలని కోరింది. మున్ముందు సెక్షన్ 301 విచారణల తుది నిర్ణయాలు, అమెరికా కొత్త సుంకాల నిర్మాణం స్పష్టమైన తర్వాతనే ఒప్పందంపై తదుపరి అడుగులు పడే అవకాశం ఉంది. ఐరోపా సంఘంతో వాణిజ్య ఒప్పందం అమలు, ఇతర దేశాలతో ఒప్పందాల ప్రయోజనాలపై వ్యాపార, ఎగుమతి రంగాలు దృష్టి సారించాయి. ఎగుమతిదారులు, రైతులు, పరిశ్రమల వర్గాల్లో సుంకాల స్థిరత్వం, మార్కెట్ యాక్సెస్‌పై స్పష్టత రావాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది. వాణిజ్య విధానాలు, చట్టపరమైన నిబంధనలు, ఇంధన భద్రత అంశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలనే అభిప్రాయాలు చర్చలో ప్రధానంగా నిలుస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు: ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం: దారులు మూసుకుపోయాయా.. విత్త మంత్రి మాటల సారాంశం అదేనా?
రష్యా ఆయిల్ టారిఫ్‌లు, భారత–అమెరికా వాణిజ్య ఒప్పందం.!
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[India-US trade Agreement, US tariffs, , Section 301, Tariffs Russian oil, TeluguOne]


