కాలం మారినా తగ్గని నమ్మకం.. భారతదేశంలో తపాలా సేవల ప్రయాణం, ప్రాముఖ్యత..!
Published on: Sat Oct 10, 2026 5:50PM
కాలం మారినా తగ్గని నమ్మకం.. భారతదేశంలో తపాలా సేవల ప్రయాణం, ప్రాముఖ్యత..!
.webp)
మన జీవితంలో ఉత్తరాల ప్రాముఖ్యత, తపాలా వ్యవస్థ సేవలను స్మరించుకోవడానికి ప్రతీ సంవత్సరం అక్టోబర్ పదో తేదీన జాతీయ తపాలా దినోత్సవం జరుపుకుంటాం. ఒకప్పుడు దూరంగా ఉన్న బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారాలు తెలుసుకోవాలన్నా, ముఖ్యమైన వార్తలు పంచుకోవాలన్నా ఉత్తరాలే ఏకైక మార్గంగా ఉండేవి. సాంకేతికత ఎంత పెరిగినా, చేతికి ఫోన్ వచ్చినా తపాలా శాఖ అందించిన సేవలు, అనుబంధాలు ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే ప్రపంచ తపాలా దినోత్సవానికి, జాతీయ తపాల దినోత్సవాని తేడా ఏమిటి? జాతీయ తపాలా దినోత్సవం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
తపాలా దినోత్సవం..
అక్టోబర్ తొమ్మిదో తేదీన ప్రపంచ తపాలా దినోత్సవం జరుగుతుంది. దానిని పురస్కరించుకుని మరుసటి రోజు, అంటే అక్టోబర్ పదో తేదీన మన దేశంలో జాతీయ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భారతదేశంలో క్రమబద్ధమైన తపాలా వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి పదిహేడో శతాబ్దంలోనే పునాదులు పడ్డాయి.1854 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ హయాంలో ఆధునిక తపాలా శాఖ అధికారికంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ రోజు నుంచి నేటి వరకు ఈ శాఖ దేశ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూనే ఉంది.
తపాలా శాఖలో మార్పులు..
ఒకప్పుడు కేవలం ఉత్తరాలు చేరవేయడానికే పరిమితమైన తపాలా శాఖ, కాలక్రమేణా అనేక మార్పులు చూసింది. పోస్టల్ మనీ ఆర్డర్ల ద్వారా డబ్బులు పంపడం, తంతి సేవలు అందించడం వంటివి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేశాయి. ఇప్పటికీ మారుమూల గ్రామాలలో కూడా పోస్ట్ ఆఫీసులు అందుబాటులో ఉండి ప్రజలకు నమ్మకమైన సేవలు అందిస్తున్నాయి.
డిజిటల్ యుగంలో తపాలా శాఖ..
ప్రస్తుత డిజిటల్ యుగంలో తపాలా శాఖ కూడా తన రూపురేఖలను మార్చుకుంది. కేవలం ఉత్తరాలకే పరిమితం కాకుండా పొదుపు పథకాలు, ఇన్స్యూరెన్స్ సేవలు, పార్సిల్ అండ్ స్పీడ్ పోస్ట్ సేవలు అందిస్తోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అందరికీ బ్యాంకింగ్ సేవలను గుమ్మం ముందుకు తీసుకువచ్చింది. ఈ విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను జోడించుకుని ముందుకు సాగుతోంది.
ఉత్తరం తెచ్చే పోస్టుమ్యాన్ కోసం ఆత్రుతగా ఎదురుచూసిన రోజులు మన అనుభవాల్లో తీపి గుర్తుగా మిగిలిపోయాయి. దేశంలో నలుమూలలా విస్తరించిన ఈ వ్యవస్థ, ప్రజల మధ్య అనుబంధాలను కలపడంలో కీలక పాత్ర పోషించింది. జాతీయ తపాలా దినోత్సవం అనేది తపాలా శాఖ సిబ్బంది కష్టాన్ని గుర్తించడానికి, సమాజానికి వారు చేసిన సేవలను గౌరవించడానికి ఒక మంచి సందర్భం.
*రూపశ్రీ.


