TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ ఒత్తిళ్లను అధిగమించేందుకు మోడీ వ్యూహాలు.!

Published on: Fri Sep 4, 2026 3:00PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనుసరిస్తున్న   విధానాలు, వాణిజ్య సుంకాల ఒత్తిళ్లను తట్టుకునేందుకు ఇండియా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలతో వరుస దౌత్య చర్చలు జరుపుతూ, వాణిజ్య, వ్యూహాత్మక ఒప్పందాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇదే విషయాన్ని  ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషణలుసైతం చెబుతున్నాయి. గత కొంతకాలంగా మిత్రదేశాలతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడం ద్వారా భారత్ తన ఆర్థిక,  రక్షణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది.  అమెరికా యంత్రాంగం అనుసరిస్తున్న   సుంకాల విధానాల నేపథ్యంలోనే ఈ దౌత్యపరమైన మార్పు వేగం పుంజుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ప్రభుత్వం  ఇండియా దిగుమతులపై పాతిక శాతం రెసిప్రోకల్ సుంకాన్ని ప్రకటించడంతో పాటు, రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నారన్న కారణంతో మరో 25 శాతం అదనపు సుంకాన్ని విధించింది. 

దీనివల్ల  మొత్తం సుంకం  భారం 50 శాతానికి చేరుకుంది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, అనంతరం జరిగిన దౌత్య  చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్యా వాణిజ్య ఒప్పందం కుదిరింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడం, అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అంగీకరించడం వంటి షరతులతో అమెరికా తన సుంకాల నిబంధనలను సవరించుకుంది.

 ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా ప్రపంచవ్యాప్తంగా తన భాగస్వామ్యాలను విస్తరించడంపై దృష్టి సారించింది. స్వాతంత్య్రానంతరం భారత్ అనుసరించిన అలీనోద్యమ సిద్ధాంతం క్రక్రమేణా మారుతూ, నేడు  మల్టీ-అలైన్‌మెంట్ లేదా  ఆమ్నీ అలైన్‌మెంట్ రూపంలో రూపాంతరం చెందింది. అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూనే, రష్యాతో వ్యూహాత్మక బంధాన్ని నిలుపుకోవడం, ఐరోపా దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతో పాటు గ్లోబల్ సౌత్ దేశాలతోనూ వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకోవడం ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం.  

గత ఏడాది కాలంలో ప్రధాని మోదీ సుమారు 20 దేశాలలో   పర్యటించగా.. 13 దేశాల అధినేతలు భారత్‌ను సందర్శించారు. కేవలం మర్యాదపూర్వక భేటీలకే పరిమితం కాకుండా.. అత్యవసర వ్యాపార ఒప్పందాలు,  వాణిజ్య భాగస్వామ్యాలే లక్ష్యంగా ఈ భేటీలు సాగాయి.  యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ((ఈఎఫ్ టీఏ)  దేశాలతో కుదిరిన  వాణిజ్య ఒప్పందం ద్వారా రానున్న సంవత్సరాల్లో భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు తుది దశకు చేరుకోవడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేయనుంది.  రక్షణ రంగంలోనూ భారత్ స్వయంసమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. జర్మనీతో కలిసి అత్యాధునిక జలాంతర్గాముల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్-75I ఒప్పందం తుది దశకు చేరుకోవడం దేశీయ రక్షణ రంగానికి ఎంతో కీలకం కానుంది. 

అదే విధంగా ఫ్రాన్స్, బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలతో సముద్ర భద్రత, షిప్‌బిల్డింగ్, సాంకేతికత మరియు అంతరిక్ష రంగాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా భారత్ తన వాణిజ్య పరిధిని మరింత విస్తరించుకుంటోంది.  అయితే ఈ దౌత్యపరమైన విజయాల వెనుక కొన్ని సవాళ్లు,  విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భారత్ కొన్ని కీలక రాయితీలు ఇవ్వాల్సి వచ్చిందని, ఇది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై ప్రభావం చూపుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

అలాగే యూరోపియన్ దేశాలతో కుదిరిన ఒప్పందాలు పూర్తిస్థాయిలో ఆమోదం పొంది అమలులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడం ద్వారానే దేశ ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  భవిష్యత్తులో గ్లోబల్ రాజకీయాల్లో భారత్ కేవలం ఒక దేశంతో నడిచే శక్తిగా కాకుండా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల శక్తివంతమైన ధ్రువంగా ఎదుగుతుందా లేదా అనేది ఈ ఒప్పందాల విజయవంతమైన అమలుపైనే ఆధారపడి ఉంటుంది. దేశీయంగా పారిశ్రామికోత్పత్తిని పెంచుతూ, విదేశీ పెట్టుబడులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారానే ఈ దౌత్య వ్యూహాలు సార్థకతను సంతరించుకోగలవు.

 -సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.    


[Indias new strategy to counter Trump, tariff pressures fromUS President, Prime Minister Modi s diplomacy,  agreements, Telugu One]