TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విదేశాలకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్.!

Published on: Thu Sep 17, 2026 9:35AM

విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు  ఇది బిగ్ అలర్ట్.  2026లో ప్రపంచవ్యాప్తంగా   9 దేశాలు తమ వీసా నిబంధనలను సవరించాయి. గతంలో మాదిరిగా విమానం దిగిన తర్వాత లేదా ఆ దేశానికి వెళ్లిన వెంటనే వీసా లభించే  వీసా ఆన్ అరైవల్  సౌకర్యాన్ని ఆ దేశాలు   రద్దు చేశాయి. దీని స్థానంలో ప్రయాణానికి ముందే ఆన్‌లైన్‌లో ఇ-వీసా లేదా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ పొందడాన్ని   తప్పనిసరి చేశాయి.

ఈ కొత్త నిబంధనల కారణంగా విదేశీ పర్యటనలు వెళ్లే పర్యాటకులు మరింత అప్రమత్తంగా ఉండాలని ట్రావెల్ నిపుణులు  హెచ్చరిస్తున్నారు. పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజా డేటా ప్రకారం.. ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 73వ స్థానంలో కొనసాగుతోంది. 2025 నాటి డేటాతో పోలిస్తే, కొన్ని ప్రముఖ దేశాల్లో మన దేశ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం పూర్తిగా దూరమైంది. 

ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా లావోస్, ఖతార్ దేశాలలో ఇప్పటివరకు అమల్లో ఉన్న వీసా ఆన్ అరైవల్ విధానం రద్దైంది. ఇకపై ఈ దేశాలకు వెళ్లాలంటే ప్రయాణానికి ముందే   ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. అలాగే మన  పొరుగు దేశమైన శ్రీలంక సైతం త గతంలో ఉన్న ఇ-వీసా ఆన్ అరైవల్ స్థానంలో..  ప్రయాణానికి ముందే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ) పొందాలని స్పష్టం చేసింది. ఇక పశ్చిమాసియా దేశమైన ఇరాన్ 2025 నవంబర్ నుంచే వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని నిలిపివేయగా, ప్రస్తుతం అక్కడ కూడా ఇ-వీసా ఉంటేనే ప్రవేశం లభిస్తుంది.

మరోవైపు కేప్ వెర్డే దేశం 2026 జనవరి 1 నుంచి భారత్‌తో సహా మొత్తం 96 దేశాల పౌరులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని ఎత్తివేసింది. నికరాగ్వా  కూడా 2026 ఫిబ్రవరి 14 నుంచి భారత పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఆన్‌లైన్ ద్వారా ఎలక్ట్రానిక్ వీసా లేదా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకునే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే, కొన్ని దేశాలు మాత్రం భారతీయుల కోసం వీసా ప్రక్రియను కొంతమేర సులభతరం చేయడం కాస్త ఊరటనిచ్చే అంశం.

గతంలో సాంప్రదాయ విధానాన్ని అనుసరించిన చిలీ, ఘనా, వెనిజులా దేశాలు ఇప్పుడు ఇ-వీసా ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చాయి. వీసా నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుండటంతో, ఎవరైనా విదేశాలకు వెళ్లే ముందు సంబంధిత దేశాల ఎంబసీ వెబ్‌సైట్లను పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. లేదంటే విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

[indian travelers, visa rules changed, visa on arrival, e-visa requirements, international travel alert, indian passport, Telugu One]