శాఫ్ గేమ్స్ లో పాల్గొనేందుకు పాక్ కు ఇండియా జట్లు?
Published on: Tue Sep 8, 2026 9:28AM

ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రీడా సంబంధాలు పునరుద్ధరణకు నోచుకోనున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తున్నది. ఇరు దేశాల మధ్యా క్రీడా సంబంధాల పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగు పడింది. ముందు ముందు జరిగే అంతర్జాతీయ క్రీడా వేడుకల్లో పాల్గొనే నిమిత్తం, భారత క్రీడా బృందాలు పాకిస్థాన్‌లో పర్యతించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
2027 పాకిస్థాన్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ (శాఫ్) గేమ్స్‌లో భారత క్రీడాకారులు ఆ దేశంలో అడుగుపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అన్నిటికీ మించి శాఫ్ క్రీడలలో ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించే క్రీడాకారులకు ఇండియన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ పాక్ మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడుతున్నాయి.
శాఫ్ గేమ్స్ లో పాల్గొనేందుకు ఇండియన్ అధ్లెట్లు పాక్ కు వెళ్లేందుకు ఇండియన్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తుల వాస్తవమే.. ఇరు దేశాల మధ్యా దెబ్బతిన్న క్రీడా సంబంధాలు మళ్లీ మొదలైనట్లే భావించారు. భారత క్రికెట్ జట్టు చివరగా 2008 సంవత్సరంలో పాక్‌లో పర్యటించింది. ఆ తర్వాత నుంచి పాకిస్థాన్ లో ఇండియన్ క్రీడా జట్లు పర్యటించిన సందర్భం లేదు.

ఒక వేళ శాఫ్ క్రీడల పోటీల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారులు పాకిస్థాన్ వెళ్లేందుకు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలు వాస్తవమే అయితే.. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడేందుకు దోహదం చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇండియా నుంచి ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.
[Indian Sports Teams to Pakistan, SAF Games 2027, India Pakistan Sports Relations, South Asian Federation Games, Pakistan Media]


