రైల్వే కొత్త రూల్.. ట్రైన్లో లౌడ్ మ్యూజిక్ పెడితే జైలుకేనా.?
Published on: Mon Oct 19, 2026 2:41PM
.webp)
రైలు ప్రయాణం అంటేనే ఎంతో ఉత్సాహం, తీపి గుర్తులు. అయితే చాలా మంది ప్రయాణికులు తోటి ప్రయాణికుల సౌకర్యాన్ని గాలికొదిలేసి తమ మొబైల్స్‌లో భారీ శబ్దంతో పాటలు పెట్టడం, వీడియోలు చూడడం లేదా స్పీకర్ ఫోన్లలో గట్టిగా మాట్లాడుతుండడం వంటి ఇబ్బందికరమైన పనులకు పాల్పడుతుంటారు. ఈ రకమైన ప్రవర్తన వల్ల పక్క సీట్లలో ప్రయాణించే వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఈ సమస్యను పూర్తిగా అరికట్టేందుకు భారతీయ రైల్వే శాఖ ఇప్పుడు అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం, ఇకపై రైళ్లలో లేదా రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్లను లౌడ్ స్పీకర్లలో వినియోగించడం, పెద్ద ఎత్తున సంగీతం ప్లే చేయడం వంటి నిబంధన ఉల్లంఘనలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
సౌరత్ రైల్వే హెడ్‌క్వార్టర్స్ కమర్షియల్ బ్రాంచ్ ఇటీవల తన డివిజన్లకు జారీ చేసిన అధికారిక ఆదేశాల ప్రకారం, ప్రయాణికులు రైలు ప్రయాణ సమయాల్లో తోటివారికి ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించకుండా ప్రవర్తించాలి. రైల్వే చట్టంలోని సెక్షన్ 145(2) ప్రకారం, అలాగే 'జన్ విశ్వాస్' సవరణ చట్టం నిబంధనల ఆధారంగా ఈ కఠినచర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రయాణికుడు రైలులో లేదా స్టేషన్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా మొబైల్ స్పీకర్లు ఆన్ చేయడం లేదా లౌడ్ మ్యూజిక్ ప్లే చేయడం చేస్తే, రైల్వే సిబ్బంది వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటారు. మొదటిసారి ఈ నిల్లంఘనకు పాల్పడితే రూ. 1,000 వరకు జరిమానా విధించడంతో పాటు వారి టికెట్ లేదా పాస్‌ను కూడా రద్దు చేసే అధికారం రైల్వే అధికారులకు ఉంటుంది.

అంతేకాకుండా, రైల్వే ఉద్యోగులు లేదా టీటీఈ (TTE) హెచ్చరించినప్పటికీ కొందరు ప్రయాణికులు తమ తీరు మార్చుకోకుండా మొండిగా వ్యవహరిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తే, శిక్ష మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి పట్టుబడిన నిందితులకు సింపుల్ జైలు శిక్ష ఆరు నెలల వరకు విధించవచ్చని, లేదా రూ. 5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, లేదంటే ఈ రెండు శిక్షలు ఒకేసారి కూడా వర్తించే అవకాశం ఉందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. టికెట్ ఎగ్జామినర్ లేదా అంతకంటే పై స్థాయి కమర్షియల్ సిబ్బందికి రూ. 1,000 పెనాల్టీ విధించే అధికారాలను కల్పించారు.
ఈ నిబంధనల పట్ల ప్రయాణికులలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు రైల్వే డివిజన్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. రైల్వే స్టేషన్లలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా హిందీ, ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషలలో ఎప్పటికప్పుడు హెచ్చరిక ప్రకటనలు చేయనున్నారు. "దయచేసి ప్రయాణ సమయంలో మొబైల్స్ లేదా వీడియోలను స్పీకర్ మోడ్‌లో ఉంచకండి, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా గట్టిగా మాట్లాడకండి, తప్పనిసరిగా ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ మాత్రమే వాడండి" అంటూ సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణాలలో ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన అనుభవాన్ని పొందేలా చూసేందుకే రైల్వే శాఖ ఈ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
[ Indian Railways rules, train journey mobile speaker ban, Rs 1000 fine train, loud music railway fine, Railways Act section 145, train travel guidelines, PM MODI, Railway Minister Ashwini Vaishnaw, Telugu One, Telugu News ]


