ప్రయాణీకుల భద్రతకే పెద్ద పీట: రైళ్లలో రాత్రిళ్లు మొబైల్ ఛార్జింగ్‌పై నిషేధం.!
Published on: Thu Oct 29, 2026 11:34AM

ప్రయాణీకుల భద్రత దిశగా ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రిళ్లు రైళ్లలో మెబైల్ ఫోన్లు, లాప్ టాప్ ల చార్జింగ్ పై నిషేధం విధించింది. ఈ నేషేధం వెంటనే అమలులోకి వచ్చింది. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరిచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది. రైలు ప్రయాణాల సందర్భంగా అర్ధరాత్రి వేళల్లో సంభవించే అగ్నిప్రమాదాల ముప్పు నివారించేందుకు గాను ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
రాత్రి పూట ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. రైల్వులు తీసుకువచ్చిన ఈ నూతన నిబంధన మేరకు రాత్రి 11 గంటల నుంచీ ఉదయం 5 గంటల వరకు కోచ్‌లలోని అన్ని రకాల మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లను మూసిస్తారు. ఈ మేరకు దేశంలోని అన్ని రైల్వే జోన్లకు సర్క్యులర్ జారీ చేస్తూ, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలంటూ రైల్వే బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
రాత్రి వేళల్లో ప్రయాణికులు నిద్రపోతున్నప్పుడు ఛార్జర్లు ఓవర్ హీట్ కావడం, షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్ల అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని రైల్వే శాఖ గుర్తించింది. ఈ క్రమంలోనే రాత్రివేళల్లో మొబైల్, లాప్ టాప్ ల చార్జింగ్ ను నిషేధించింది. ఈ నిషేధం సందర్భంగా తాజాగా రైలు ప్రయాణంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను ఉదాహరణలుగా పేర్కొంది. ఒక ప్రయాణికుడు ఛార్జింగ్ పాయింట్‌కు అనుసంధానించిన పవర్ బ్యాంక్ తీవ్రమైన ఓవర్ హీటింగ్ కారణంగా ఒక్కసారిగా అది పేలిపోయి, కోచ్ నిండా దట్టమైన పొగ వ్యాపించిన ఉదంతాన్ని పేర్కొంటూ.. ఇలాంటి భద్రతా లోపాలు పునరావృతం కాకుండా ఉండటానికి రాత్రి వేళల్లో చార్జింగ్ పై నిషేధం మాత్రమే ఏకైక పరిష్కారంగా రైల్వే శాఖ భావించి, ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా ప్రయాణికులు రాత్రిపూట ఫోన్లు, పవర్ బ్యాంక్‌లు, లాప్ టాప్ లను ఛార్జింగ్‌కు పెట్టి నిద్రపోతుంటారు. ఛార్జింగ్ పూర్తయిన తర్వాత కూడా ప్లగ్‌లు తీయకపోవడం వల్ల సాకెట్లలో తీవ్రమైన వేడి ఉత్పన్నమై అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా అర్ధరాత్రి వేళల్లో పర్యవేక్షణ తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరిగినా వెంటనే గుర్తించే అవకాశం ఉండదు.
ఈ సమస్యలను అధిగమించడానికే రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ప్రధాన విద్యుత్ కనెక్షన్ కట్ చేయాలని రైల్వే రక్షణ దళం, సాంకేతిక విభాగాలు సూచించాయి. ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను కూడా రంగంలోకి దించుతున్నారు. రైళ్లలో రాత్రివేళ ఛార్జింగ్ స్విచ్‌లను నిలిపివేస్తున్నారా లేదా అనేది తనిఖీ అధికారులు ఆకస్మికంగా పరిశీలిస్తారు. నిబంధనలు పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
[Indian Railways Ban Mobiles Night Charging, Train Mobile Charging Rules, Railway Board Directives, Train Safety Measures, Indian Railways Charging Port Closure, Laptops, Power Banks, Telugu One]


