అరేబియా సముద్రంలో ఇండియన్ నౌకను ఢీ కొన్న పాకిస్థాన్ షిప్.. బరితెగింపు కాకమరేంటి?
Published on: Wed Sep 16, 2026 3:39PM

కవ్వింపులకు పాల్పడటం, ఆ తరువాత కాళ్ల బేరానికి రావడం పాకిస్థాన్ కు రివాజుగా మారిపోయినట్లు కనిపిస్తున్నది. తాజాగా పాకిస్థాన్ మళ్లీ అటువంటి కవ్వింపు చర్యకు పాల్పడింది. ఉపేక్షించడానికి వీలులేని, వీలు కాని తీరుగా వ్యవహరించింది. తాజాగా పాక్ నౌకాదళానికి చెందిన నౌక ఒకటి భారత యుద్ధ నౌకను ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ తాత్కాలిక దౌత్యవేత్తను విదేశాంగ శాఖకు పిలిపించి మరీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. నావికాదళం తీరు ఇసుమంతైనా అంగీకారయోగ్యం కాదని గర్హించింది. నిబంధనలను తుంగలోకి తొక్కి పాక్ నౌకాదళం వ్యవహరించిన తీరు రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీయడం ఖాయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివరాల్లోకి వెడితే..
ఉత్తర అరేబియా సముద్రంలో ఒమన్ తీరానికి దాదాపు 220 కిలోమీటర్ల తూర్పు దిశలో అంతర్జాతీయ జలాల్లో ఈ ఘటన జరిగింది. ఇండియన్ నేవీకి చెందిన ఒక ఫ్రంట్‌లైన్ యుద్ధనౌక సాధారణ నిఘా, పెట్రోలింగ్ విధులను నిర్వర్తిస్తున్న తరుణంలో పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన పీఎన్ఎస్ హునైన్ అనే పెట్రోలింగ్ నౌక వేగంగా, ఎలాంటి ముందస్తు సంకేతాలు ఇవ్వకుండా.. భద్రతా ప్రమాణాలను తుంగలోకి తొక్కి మరీ భారత నౌక సమీపానికి దూసుకొచ్చింది. భారత నౌక సిబ్బంది స్పందించి అంతర్జాతీయ సముద్ర మార్గ నిబంధనల ప్రకారం రేడియో ఛానెల్ ద్వారా పదే పదే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఖాతరు చేయకుండా పాక్ నౌక తన వేగాన్ని మరింత పెంచింది. ఎటువంటి వృత్తిపరమైన బాధ్యత లేకుండా అత్యంత ప్రమాదకర రీతిలో వ్యహరించిన పాక్ నౌక, భారత నౌకను పక్క నుంచి తాకుతూ ముందుకు వెళ్లింది.
.webp)
అయితే, ఈ ఘటనలో భారత యుద్ధనౌకకు ఎలాంటి నిర్మాణపరమైన (స్ట్రక్చరల్) నష్టం జరగలేదని, నౌక సామర్థ్యానికి ఎటువంటి భంగం వాటిల్లలేదని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. భారత నౌకలోని సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదని, ప్రమాదం జరిగిన వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చి నౌక తన నిర్దేశిత విధులను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. తక్షణమే రెండు నౌకలు వేర్వేరు దిశలకు మళ్లినప్పటికీ, పాక్ నౌకాదళ సిబ్బంది అనుసరించిన ప్రమాదకర విన్యాసాలు మాత్రం సముద్ర భద్రతా నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయి. ఈ వ్యవహారంపై భారత నావికాదళం ఇప్పటికే సైనిక మార్గాల ద్వారా పాకిస్థాన్ సైనిక అధికారులతో సంప్రదింపులు జరిపి, ఈ తరహా బాధ్యతారహిత చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ దుర్ఘటనపై దౌత్యపరంగా గట్టి చర్యలు చేపట్టిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ), పాకిస్థాన్ అధికారుల తీరుపై నిరసన పత్రం అందించింది. 1991 ఏప్రిల్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక విన్యాసాలు, కదలికలపై కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలోని ఆర్టికల్ 10 నిబంధనలను పాకిస్థాన్ నౌక ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ జలాల్లో సైనిక నౌకలు కదులుతున్నప్పుడు పాటించాల్సిన కనీస జాగ్రత్తలను, పరస్పర అవగాహన ఒప్పందాలను పాక్ బేఖాతరు చేసిందని విదేశాంగ శాఖ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులు పునరావృతం కాకుండా అరికట్టేందుకు పాకిస్థాన్ ప్రభుత్వ, సైనిక యంత్రాంగం తమ నౌకాదళ సిబ్బందిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని దౌత్యవేత్తకు తేల్చిచెప్పారు. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయం కూడా ఇదే అంశంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ప్రత్యేకంగా నిరసన తెలపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
భారత్, పాకిస్థాన్ నౌకాదళాల మధ్య ఇటువంటి ఘర్షణలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదు. పదిహేనేళ్ల క్రితం, అంటే 2011 జూన్‌లో గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో కూడా ఇలాంటిదే ఒక ఉద్రిక్త సంఘటన వెలుగుచూసింది. సోమాలి పైరేట్ల బారి నుంచి విముక్తి పొందిన ఒక వాణిజ్య నౌకను రక్షించే క్రమంలో, పాకిస్థాన్ నౌక 'పీఎన్ఎస్ బాబర్' అత్యంత వేగంగా దూసుకొచ్చి భారత యుద్ధనౌక 'ఐఎన్ఎస్ గోదావరి'ని ఢీకొట్టింది. ఆ ఘటనలో ఐఎన్ఎస్ గోదావరికి చెందిన హెలికాప్టర్ డెక్ ఫ్లైట్ డెక్ నెట్ దెబ్బతిన్నది. నాటి ఘటనలోనూ పాకిస్థాన్ నౌకాదళం తప్పును కప్పిపుచ్చుకునే యత్నం చేయగా, భారత్ ఆధారాలతో సహా నిరూపించింది. మళ్లీ ఇన్నాళ్లకు సరిగ్గా అదే తరహాలో ఉత్తర అరేబియా సముద్రంలో పాక్ నౌక పీఎన్ఎస్ హునైన్ ప్రవర్తించడం పట్ల రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రయాన భద్రతను, అంతర్జాతీయ శాంతి సూత్రాలను దెబ్బతీసే ఈ చర్యలను భారత్ అత్యంత తేలిగ్గా తీసుకోబోదని దౌత్య పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
రాబోయే రోజుల్లో సముద్ర సరిహద్దుల వద్ద రక్షణ నిఘాను మరింత కట్టుదిట్టం చేసే దిశగా భారత నావికాదళం అడుగులు వేయనుంది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకల రక్షణ, ఉగ్రవాద నిరోధక పెట్రోలింగ్, సముద్రపు దొంగల ఏరివేత వంటి మానవతా విధులతో పాటు, శత్రు దేశాల కవ్వింపు చర్యలను తిప్పికొట్టేలా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సముద్ర మార్గాల్లో నిరంతరం కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్‌ను పటిష్టం చేయాలని, ఒకవేళ పాకిస్థాన్ నావికాదళం మళ్లీ ఇలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే అంతర్జాతీయ వేదికలపై మరింత గట్టిగా ఎండగట్టాలని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
[Indian Navy, Pakistan Navy Ship, Arabian Sea Confrontation, Indian Ministry of External Affairs, Summoning of Pakistani Diplomat, Telugu One]


