వీర జవాన్ పార్థివదేహం తీసుకెళ్తుండగా ప్రమాదం.. నలుగురు దుర్మరణం.!
Published on: Sun Oct 4, 2026 4:37PM

దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ కన్నుమూసిన సైనికుడి పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్న అంబులెన్స్‌ను మృత్యువు వెంటాడింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆర్మీలో సుబేదార్ మేజర్‌గా సేవలు అందించిన సత్యవాన్ సింగ్ దేశ రక్షణలో వీరమరణం పొందారు. లక్నో నుంచి ఆయన భౌతికకాయాన్ని ఘాజీపూర్‌లోని స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఈ పెనుప్రమాదం సంభవించింది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ దుర్ఘటన జరిగింది. సుల్తాన్‌పూర్ జిల్లా హలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 79.6 కిలోమీటర్ మైలురాయి వద్ద వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ వేగవంతమైన ట్రక్ తీవ్రంగా ఢీకొట్టింది. ఈ అనూహ్య ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘోర సంఘటనలో అమర జవాన్ కుమారుడు గౌరవ్ సింగ్, అంబులెన్స్ డ్రైవర్ జస్పాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
.webp)
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జవాన్ సోదరుడు రాజన్ చౌదరి, మేనల్లుడు రామ్ సముజ్ సింగ్‌లను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ వారు కూడా ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాన్ మృతదేహం రాక కోసం కన్నీటితో ఎదురుచూస్తున్న కుటుంబంలో ఈ పెనుప్రమాదం మరింత శోఖాన్ని మిగిల్చింది.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుబేదార్ మేజర్ సత్యవాన్ సింగ్ పార్థివ దేహాన్ని హలియాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉంచి పూర్తి సైనిక లాంఛనాలతో భద్రపరిచారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
.webp)
[ Indian Army, Veer Jawan, Jawan Funeral, Jawan Mortal Remains, Ambulance Accident, Road Accident, Fatal Accident, Satyawan Singh, Purvanchal Expressway, CM Yogi Adityanath, Telugu One, Telugu News ]


