TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇమ్మిగ్రేషన్ సమస్యలపై గణమెత్తిన ఇండియన్ అమెరికన్లు: కాంగ్రెస్ సభ్యుడితో భేటీ.!

Published on: Wed Sep 23, 2026 10:18AM

అమెరికాలో నివసిస్తున్న ఇండియన్స్ ఎదుర్కొంటున్న ఇమ్మిగ్రేషన్ సమస్యలపై అమెరికన్ ఇండియన్స్ గళమెత్తారు.  ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా ప్రక్రియలు, నివాస హోదా వంటి అంశాలపై తమ ఆందోళనలను తెలియజేసేందుకు  ఇండియన్ అమెరికన్స్ నడుంబిగించారు. ఈ క్రమంలో వారు ఓ కాంగ్రెస్‌ సభ్యుడిని కలిసి తమ సమస్యలను వివరించారు. 

అమెరికాలో విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం స్థిరపడిన భారతీయులపై ఇటీవల అగ్రరాజ్యం ఇమ్మిగ్రేషన్ విధానాల్లో చేసిన మార్పులు ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వీసా పొడిగింపులు, శాశ్వత నివాస అనుమతులు, కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకురావడం వంటి విషయాలలో వలసదారులు ఇబ్బందులు, చిక్కులు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ నాయకులు గళమెత్తారు. విద్యార్థులు, కుటుంబాలు, వైద్య నిపుణులు ఎదుర్కొంటున్న ఇమ్మిగ్రేషన్‌ సంబంధిత సమస్యలను అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు జిమ్‌ మెక్‌గవర్నన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

సెప్టెంబర్‌ 19న ఇండియా వోర్సెస్టర్‌ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో  ఇండియన్ అమెరికన్‌ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వైద్యులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, పౌర హక్కుల కార్యకర్తలు ఈ చర్చలలో పాల్గొన్నారు. అగ్రరాజ్య ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో అమెరికాలో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇమ్మిగ్రేషన్‌ విధానాలు, ఆరోగ్య సేవలు, ఆర్థిక అవకాశాలు, పౌర వ్యవహారాల్లో భాగస్వామ్యం, భారత్‌,అమెరికా సంబంధాలు వంటి పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. 

అమెరికాలో విద్య  అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు, అక్కడ నివసిస్తున్న కుటుంబాలు, వైద్య రంగంలో పనిచేస్తున్న నిపుణులు ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థకు సంబంధించి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమ్యూనిటీ నాయకులు ప్రస్తావించారు. వలస విధానాలకు సంబంధించిన సమస్యలు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబాల జీవన పరిస్థితులు, ఉద్యోగాలు, వృత్తిపరమైన అవకాశాలపైనా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడితో  ఇండియన్ కమ్యూనిటీ భేటీ కావడం ప్రాదాన్యత సంతరించుకుంది.  

అమెరికాలో స్థిరపడిన భారతీయులకు ఇమ్మిగ్రేషన్‌ అంశాలు ఎంతో ప్రాధాన్యమైనవి. విద్యార్థుల నుంచి వైద్య నిపుణుల వరకు వివిధ వర్గాల ప్రజలు తమ వృత్తి, కుటుంబ, నివాస సంబంధిత విషయాల్లో వలస విధానాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కమ్యూనిటీ నాయకులు అమెరికా ప్రజాప్రతినిధులతో సమావేశమై తమ సమస్యలను వివరించడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా.. ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ లో సమస్యల పరిష్కారంపై ఆశలు చిగురించాయి.  

[Indian Americans, US Immigration Issues, Jim McGovern, Indian American Community,   US India Relations, Telugu One]