TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాదీలకు ముందే వచ్చిన విజయదశమి: ఉప్పల్ స్టేడియంలో విండీస్, టీమ్ ఇండియా టి20.!

Published on: Wed Oct 14, 2026 9:33AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులకు విజయదశమి ముందే వచ్చేసింది. ఔను  ఇండియా, వెస్టిండీస్ మధ్య ఐది టి20ల సిరీస్ లో భాగంగా నాలుగో మ్యాచ్   బుధవారం (అక్టోబర్‌ 14) ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే ఇండియా 2-1 ఆధిక్యతతో ఉండగా, హైదరాబద్ టి20లో విజయం సాధించి గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో గేమ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.  అదే సమయంలో ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని విండీస్ భావిస్తోంది.  ఈ సిరీస్ లో తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ గెలిచింది. ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో భారత్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో ముందంజ వేసింది. ఇక బ్యాటింగ్ కు అనుకూలించే హైదరాబాద్‌ పిచ్ పై జరగనున్న నాలుగో వన్డే ఉత్కంఠభరితంగా సాగుతుందనడంలో సందేహం లేదు.  

ఇక టీమ్ ఇండియా, విండీస్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న నాలుగో టి20కి పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు తరలి వస్తారన్న అంచనాతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 22మందల మంది పోలీసులను భద్రతా విధుల్లో నియమించారు.  స్టేడియం, పరిసర ప్రాంతాలపై నిఘా కోసం 408 సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు వినియోగించనున్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌తో పాటు ప్రత్యేక పోలీసు బృందాలు కూడా పర్యవేక్షణ చేపట్టనున్నాయి.  
మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

అలాగే మ్యాచ్‌ కారణంగా బుధవారం (అక్టోబర్ 14) మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఉప్పల్‌, నాగోల్‌, హబ్సిగూడ, రామంతాపూర్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. ఘట్‌కేసర్‌ నుంచి ఉప్పల్‌ వైపు  మెహ్‌ఫిల్‌ హోటల్‌ సమీపంలోని మళ్లింపు పాయింట్‌ నుంచి నాగోల్‌, ఎల్బీనగర్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే,  ఎల్బీనగర్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు  నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని హెచ్‌ఎండీఏ భగాయత్‌, బోడుప్పల్‌, చెంగిచెర్ల మార్గాలను వినియోగించాలి.

ఇంకా తార్నాక నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ ఎక్స్‌ రోడ్డు వద్ద మళ్లింపును అనుసరించి నాచారం, ఎన్‌ఎఫ్‌సీ రోటరీ మార్గంలో వెళ్లాలి. అదే విధంగా  రామంతాపూర్‌ నుంచి ఉప్పల్‌ వైపు వేళ్లే వాహనాలు స్ట్రీట్‌ నంబర్‌ 8 వద్ద సూచించిన మళ్లింపు మార్గాన్ని అనుసరించాలి. ఇక పోతే హైదరాబాద్‌ వరంగల్‌  వాహనాలు ఉప్పల్‌ మీదుగా కాకుండా  ఓఆర్‌ఆర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ మార్గాలను వినియోగించాలి. 

అలాగే స్టేడియం పరిసరాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలతో వచ్చే అభిమానులు అనుమతించిన పార్కింగ్‌ ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.   మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా రహదారులపై రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో మెట్రో, ఆర్టీసీ అదనపు సేవలు అందించనున్నాయి.  

మ్యాచ్‌ టికెట్ల విక్రయాల విషయంలోనూ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.  నాట్‌ ఫర్‌ సేల్‌  ఉచిత పాస్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 11 క్రికెట్‌ పాస్‌లు, నగదు, మొబైల్‌ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నారు.  

[India vs West Indies 4th T20, IND vs WI Hyderabad Match, Uppal Stadium Traffic Diversions,  Cricket News, Uppal T20 Match,  Hyderabad Traffic Restrictions, Black Marketing  Cricket Tickets, Telugu One]