TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియాపై నిరాధార ఆరోపణలు: ఐరాస విశ్వసనీయత దెబ్బతింటుందన్నఅనూజ్ స్వరూప్.!

Published on: Sat Oct 17, 2026 12:13PM

భారతదేశంలో యువత నిరసనలు, మానసిక ఆరోగ్యం,  లింగ సమానత్వంపై ఐక్యరాజ్యసమితి  విడుదల చేసిన నివేదికలోని  ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం అనామక వ్యక్తుల నుంచి అందిన నిరాధార సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ మూడో కమిటీ సమావేశంలో ఈ అంశంపై ఇండియా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది. దేశంలో ప్రజాస్వామ్య హక్కులు, శాంతియుత నిరసనలు తెలిపే స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ రాజ్యాంగబద్ధంగా సురక్షితంగా ఉన్నాయని కుండబద్దలు కొట్టింది.

  జినా రోమెరో రూపొందించిన నివేదికలో భారత్‌పై కొన్ని   ఆరోపణలు ప్రస్తావనకు వచ్చాయి. దేశంలో యువత మానసిక ఆరోగ్యం లేదా లింగ న్యాయం గురించి మాట్లాడినప్పుడు వారిపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని, తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ వాదనలను భారత మొదటి కార్యదర్శి అనుజ్ స్వరూప్ తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ధృవీకరణ లేని,   ఊహాజనితమైన అంశాలను ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రచారం చేయడం తగదన్నారు.

ఈ సందర్భంగా భారతీయ దౌత్యవేత్త మాట్లాడుతూ, ఇండియాలో యువత రాజకీయ చైతన్యంలో, విధాన రూపకల్పనలో   భాగస్వామ్యులవుతున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించేలా యువత ఎన్నో వినూత్న ప్రజాస్వామ్య ఉద్యమాలు చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ రాజధానిలో శాంతియుతంగా ఆందోళనలు చేస్తూ, ప్రభుత్వ ఉన్నత స్థాయి నాయకులతో చర్చలు జరుపుతున్న యువత ఉదాహరణలు కంటికి కనిపిస్తున్నప్పటికీ,  వాస్తవాలను విస్మరించి ఇటువంటి నివేదికలు వెలువరించడం దుర్మార్గమని మండిపడ్డారు. 

అంతర్జాతీయ వేదికలపై నివేదికలు సమర్పించే ముందు పూర్తి స్థాయి వాస్తవాలను పరిశీలించాలనీ, వదంతులు,  ఆధారాలులేని ఆరోపణల  ఆధారంగా ఇటువంటి నివేదికలను విడుదల చేయడం ఐక్యరాజ్యసమితి విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఇండియా పేర్కొంది.  ఏకపక్ష సమాచారాన్ని ప్రమాణికంగా తీసుకుని కోట్లాది మంది పౌరులు కలిగిన ప్రజాస్వామ్య దేశంపై అభాండాలు వేయడం సరికాదని స్పష్టం చేసింది.

ఇటీవల కాలంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కూడా భారతదేశంలో యువ నాయకులతో నిర్మాణాత్మక సంభాషణలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కొనియాడిన విషయాన్ని భారత ప్రతినిధి  ఈ సందర్భంగా గుర్తు చేశారు.  అటువంటి సానుకూల పరిణామాలను పక్కన పెట్టి, బాధ్యతారహితమైన అభిప్రాయాలను ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న భారత్, పౌరుల భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడంలో ఎప్పుడూ ముందే ఉంటుందని స్పష్టంచేశారు. 

[India Rejects UN Report, UN Special Rapporteur Gina Romero, Anuj Swarup UNGA, India Youth Protests Response, UN General Assembly Third Committee, UN Credibility, Telugu One]