TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెస్ ఒలింపియాడ్ 2026: వరుసగా రెండోసారి స్వర్ణమే లక్ష్యంగా భారత్!

Published on: Wed Sep 16, 2026 11:25AM

ప్రపంచ చెస్ రంగంలో భారత రథచక్రాలు మరోసారి జయకేతనం ఎగురవేసేందుకు సిద్ధమయ్యాయి. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెడుతున్న టీమిండియా, బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు గెలిచి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. గత 2024 బుడాపెస్ట్ ఒలింపియాడ్‌లో అద్భుత ప్రదర్శనతో పురుషుల, మహిళల విభాగాల్లో పసిడి పతకాలను ముద్దాడిన భారత జట్లు, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాయి. ఓవర్ ఆల్ ఛాంపియన్‌షిప్‌లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు భారత గ్రాండ్ మాస్టర్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

పురుషుల విభాగంలో భారత జట్టుకు స్టార్ ప్లేయర్ల బలం పుష్కలంగా ఉంది. వర్లడ్ ఛాంపియన్ డి. గుకేశ్, గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద, తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. వీరికి తోడుగా గత ఎడిషన్ విజయంలో కీలక పాత్ర పోషించిన విదిత్ గుజరాతీ, నిహాల్ సరీన్ మెరుపు పెర్ఫామెన్స్ జట్టుకు తిరుగులేని బలాన్ని ఇస్తోంది. ముఖ్యంగా ఏడాది కాలంగా తీవ్రమైన ఒత్తిడి, నిలకడలేమితో ఇబ్బందిపడుతున్న గుకేశ్, నవంబర్‌లో స్విట్జర్లాండ్‌లో జరగనున్న వరల్డ్ ఛాంపియన్ షిప్‌కు ముందు ఈ ఒలింపియాడ్‌లో మళ్లీ పూర్వఫామ్ సాధించాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రజ్ఞానంద సరికొత్త ఉత్సాహంతో ఫామ్‌లో ఉండటం జట్టు విజయావకాశాలను మరింత పెంచింది.

పోటీల విషయానికొస్తే, భారత్‌కు అమెరికా మరియు ఉజ్బెకిస్తాన్ జట్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. యూఎస్ఏ జట్టులో ఫ్యాబియానో కరువానా, లెవోన్ అరోనియన్ వంటి దిగ్గజాలు ఉండగా, డిఫెండింగ్ హోస్ట్ ఉజ్బెకిస్తాన్ జట్టుకు జావోఖిర్ సిందరోవ్ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు మహిళల విభాగంలో కూడా భారత్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి నాయకత్వంలో, వరల్డ్ కప్ విన్నర్ దివ్య దేశ్‌ముఖ్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఛాలెంజర్ ఆర్. వైశాలిలతో కూడిన భారత మహిళల జట్టు స్వర్ణమే లక్ష్యంగా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మహిళల విభాగంలో భారత్‌కు జార్జియా, కజకిస్తాన్ జట్ల నుంచి ప్రధాన సవాలు ఎదురుకానుంది.

అయితే, ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే భారత క్రీడాకారులకు చేదు అనుభవం ఎదురైంది. సమర్‌కండ్ చేరుకున్న భారత జట్లకు హోటల్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో దాదాపు 5 గంటల పాటు గదులు కేటాయించలేదు. దీంతో మన క్రీడాకారులు విమానాశ్రయం మరియు హోటల్ లాబీల్లోనే సుదీర్ఘ సమయం వేచి చూడాల్సి వచ్చింది. ఇన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, వాటన్నింటినీ పక్కనపెట్టి మైండ్ గేమ్‌లో ప్రపంచాన్ని జయించేందుకు భారత చెస్ యోధులు సమరశంఖం పూరించారు. తమ ప్రతిభతో బోర్డుపై ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వరుసగా రెండోసారి బంగారు పతకాలను ముద్దాడాలని కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.

 

 

 

[Chess Olympiad 2026, India Chess Team, Samarkand Chess Olympiad, D Gukesh, R Praggnanandhaa, Arjun Erigaisi, Vidit Gujrathi, Nihal Sarin, Koneru Humpy, Divya Deshmukh]