TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.!

Published on: Tue Sep 15, 2026 12:35PM

మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు మనిషే. ఔను నిజంగా మానవుడు మహనీయుడే. దివి నుంచి గంగను భువికి దించిన భగీరథుడూ మానవుడే. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనిషి మరో మహాద్భుత ఆవిష్కరణకు చేరువ అవుతున్నాడు. ఔను.. ఇండియన్ సైన్స్ కంగంలో శాస్త్ర రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. భవిష్యత్ తరాల అవసరాల కోసం అపరిమితమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించే  కృత్రిమ సూర్యుడు.. అదే ఆర్ఠిఫిషియల్ సన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది.  నూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీని అందుకునే ప్రయోగాలలో  ఇండియన్ సైంటిస్టులు  సక్సెస్ ఫుల్ గా ముందడుగు వేశారు. . సహజంగా సూర్యుడిలో జరిగే శక్తి ఉత్పత్తి ప్రక్రియను భూమిపైనే కృత్రిమంగా పునఃసృష్టించే ఈ బృహత్తర ప్రయోగంలో భారత్ సుస్థిర స్థానం దిశగా సక్సెస్ ఫుల్ గా మందుకు సాగుతోంది. 

ఈ పరిశోధనల్లో భాగంగా గుజరాత్‌లోని ప్రముఖ పరిశోధనా కేంద్రంలోని ఎస్ఎస్టి1 టోకామాక్  రియాక్టర్‌లో సరికొత్త పరికరాలను అమర్చారు. ఇందులో భాగంగా శక్తివంతమైన 82.6 జీహెచ్ జడ్, 400 కిలోవాట్ల  గైరోట్రాన్‌ను విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసి కమిషన్ చేశారు. ఈ సాంకేతికత  నూక్లియర్ ఫ్యూజన్  ప్రక్రియకు అత్యంత కీలకమైన అల్ట్రా హాట్ ప్లాస్మాను నియంత్రించడం, ఎక్కువ కాలం స్థిరంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. టోకామాక్ రియాక్టర్ల లోపల సూర్యుడి కేంద్ర భాగం కంటే వేల రెట్లు అధిక ఉష్ణోగ్రతలను సృష్టించి..  దాన్ని అదుపులో ఉంచడం ఈ ప్రయోగం యొక్క ప్రధాన లక్ష్యం.

భూమి మీద పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తట్టుకోవడానికి, బొగ్గు,  శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ పరిశోధన ఎంతగానో దోహదం చేస్తుంది.   నూక్లియర్ ఫ్యూజన్  ప్రక్రియ ద్వారా ఎటువంటి ప్రమాదకర వ్యర్థాలు వెలువడకుండా..  పర్యావరణానికి  ఇసుమంతైనా హాని కలగకుండా అధిక మొత్తంలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే మానవాళికి ఇంధన కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారమౌతుందని అంచనా.  ఇప్పటికే ప్రపంచంలోని పలు అగ్రరాజ్యాలు ఈ తరహా కృత్రిమ సూర్య ప్రయోగాలపై దృష్టి పెట్టాయి. ఇప్పుడు ఇండియా కూడా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. 

ఇండియాలోని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ ప్రాజెక్టు విజయవంతం చేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అతి క్లిష్టమైన   అయస్కాంత క్షేత్రాల ద్వారా మిలియన్ల డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ప్లాస్మాను రియాక్టర్ గోడలకు తగలకుండా గాలిలో తేలేలా నియంత్రించడం ఈ ప్రయోగంలో అసలుసిసలు సవాల్. సైంటిస్టులు  ఈ సవాల్‌నుసక్సెస్ ఫుల్ గా అధిగమిస్తూ..  ప్రయోగాన్ని ముందుకు తీసుకువెడుతున్నారు. తాజాగా అమర్చిన గైరోట్రాన్ పరికరం ద్వారా   ప్లాస్మా స్థిరత్వం మరింత మెరుగుపడి, భవిష్యత్ ప్రయోగాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని సైంటిస్టులు ధీమాగా చెబుతున్నారు.  

ఇండియా ఇటు అంతరిక్ష రంగంలోనూ, అటు సాంకేతిక రంగంలోనూ  ఇప్పటికే కీలక పురోగమనాలను సాధించింది. తాజాగా ఆర్ఠిఫిషియల్ సన్ ప్రయోగం ద్వారా   ఇంధన రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతోంది.  ప్రయోగశాలల్లో సాధించిన ఈ విజయాలు రానున్న  కాలంలో పారిశ్రామిక అవసరాలకు అవసరమైన వాణిజ్య విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో దేశ ఆర్థిక అభివృద్ధికి, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల లక్ష్యాల సాధనకు ఈ ప్రాజెక్ట్  మైలురాయిగా నిలుస్తుందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. 

ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు ఈ ప్రాజెక్టుకు ఇస్తున్న ప్రాధాన్యత..  రానున్న దశాబ్ద కాలంలో నూక్లియర్ ఫ్యూజన్  శక్తి వాణిజ్య  పరంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఇది కేవలం ఇండియాకే కాకుండా యావత్ ప్రపంచానికి ఇంధన భద్రతను చేకూరుస్తుంది. పర్యావరణ సమతుల్యత  దెబ్బతీయకుండా భవిష్యత్ తరాలకు సురక్షితమైన ప్రపంచాన్ని అందించడంలో ఈ ఆర్టిఫిషియల్ సన్  ప్రయోగం నిస్సందేహంగా సైంటిఫిక్ ఫీల్డ్ లో ఒక రివల్యూషన్.  

[India Crucial Step,  Towards Artificial Sun, Limitless, Clean Energy, Nuclear Fusion]