గట్టి పునాదులు, బలమైన వృద్ధి.. ఇండియాకు జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ గుర్తింపు.!
Published on: Thu Sep 3, 2026 5:59PM

జపాన్‌కు చెందిన ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ జేసీఆర్ (జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) భారత ప్రభుత్వ దీర్ఘకాలిక విదేశీ, స్థానిక కరెన్సీ జారీ రేటింగ్‌లను ఒక మెట్టు పెంచుతూ 'బీబీబీ ప్లస్' స్థాయి నుంచి 'ఏ- మైనస్' స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. దేశ సెయిలింగ్ పరిమితిని కూడా 'ఏ' స్థాయికి చేర్చింది. భారత ఆర్థిక వ్యవస్థ సాధిస్తున్న పటిష్టమైన వృద్ధి తీరు, అమలు చేస్తున్న ఆర్థిక విధానాల సత్ఫలితాలు, కష్టకాలంలోనూ నిలకడను ప్రదర్శిస్తున్న స్థితిస్థాపకతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేసీఆర్ వెల్లడించింది. ఈ సానుకూల పరిణామంతో భారత దేశం జేసీఆర్ క్రెడిట్ స్కేలులో అధికారికంగా 'ఏ' కేటగిరీలోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రక పరిణామం వెనుక దేశ ఆర్థిక ప్రయాణం, వివిధ దశల్లో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు ప్రముఖంగా వెలుగులోకి వచ్చాయి. సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ అనేది ఒక దేశం తన వద్ద ఉన్న విదేశీ, స్వదేశీ రుణాలను సకాలంలో చెల్లించగల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఎస్ అండ్ పీ, ఫిచ్, మూడీస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ ఏజెన్సీలు అత్యున్నత 'ట్రిపుల్ ఏ' నుంచి 'డీ' వరకు గ్రేడ్లు కేటాయిస్తుంటాయి. ఇందులో 'బీబీబీ మైనస్' లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ అనీ, దానికంటే తక్కువగా ఉంటే జంక్' గ్రేడ్ అనీ వర్గీకరిస్తారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినప్పటికీ, గత రెండు దశాబ్దాలుగా ఈ ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌లో అత్యల్ప అంచెలలోనే ఉంటూ వస్తోంది. ఫిచ్, ఎస్ అండ్ పీ సంస్థలు సుదీర్ఘకాలంగా భారత్‌కు అట్టడుగు ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌ను మాత్రమే కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే గడిచిన కొద్ది కాలంలో పరిస్థితి మారుతూ వస్తోంది.

అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజాల సరళిపై కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో, కొన్ని ఏజెన్సీలు భారత్ రేటింగ్‌ను సవరిస్తూ వస్తున్నాయి. గత ఏడాది కాలంలో మార్నింగ్‌స్టార్ డీబీఆర్‌ఎస్, ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్, అలాగే మరో జపనీస్ సంస్థ అయిన ఆర్‌అండ్‌ఐ వరుసగా భారత్ రేటింగ్‌ను పెంచగా, తాజాగా జేసీఆర్ సంస్థ 'ఏ- మైనస్' స్థాయికి చేర్చింది. అయినప్పటికీ, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపే ఫిచ్ మరియు మూడీస్ సంస్థలు ఇప్పటికీ భారత్‌ను ప్రాథమిక ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ స్థాయిలోనే ఉంచడం గమనార్హం. భారత బ్యాంకింగ్ రంగం గతంలో తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొని, నేడు అత్యంత పటిష్టమైన స్థితికి చేరుకోవడం ఈ అప్‌గ్రేడ్ వెనుక ఉన్న ప్రధాన బలాల్లో ఒకటి.
దశాబ్ద కాలం క్రితం విపరీతంగా పెరిగిన రుణ వృద్ధి, నాటి సంక్షోభాలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ కాలంలో నామమాత్రపు పునర్నిర్మాణ పథకాల ద్వారా మొండి బకాయిలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరగడంతో, 2014 నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు భారీ స్థాయికి చేరాయి. ఈ పరిస్థితిని గమనించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. ఆర్‌బీఐ చేపట్టిన అసెట్ క్వాలిటీ రివ్యూ ద్వారా వ్యవస్థలో కూరుకుపోయిన అసలు బకాయిలు, దాగి ఉన్న ముప్పు బయటపడింది. దీంతో 2018 నాటికి మొండి బకాయిలు రికార్డు స్థాయికి చేరినప్పటికీ, ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు తీసుకున్న దిద్దుబాటు చర్యల వల్ల పరిస్థితి క్రమంగా మెరుగైంది. మార్చి 2026 నాటికి భారత బ్యాంకింగ్ రంగంలో గ్రాస్ ఎన్‌పీఏ నిష్పత్తి గణనీయంగా తగ్గగా.. దేశంలోని ఏ ఒక్క జాబితాలో ఉన్న బ్యాంకులోనూ నికర ఎన్‌పీఏ ఒక శాతానికి మించని స్థాయికి పడిపోవడం చారిత్రక విజయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేయడంలో చట్టపరమైన సంస్కరణలు కీలక పాత్ర పోషించాయి.

ముఖ్యంగా 2016లో తీసుకువచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్‌సి కోడ్ ) దేశ ఆర్థిక చరిత్రలో మైలురాయిగా నిలిచింది. నిర్ణీత కాలవ్యవధిలోగా కంపెనీల దివాలా పరిష్కారం, రుణదాతల హక్కుల పరిరక్షణ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలు ఈ చట్టం ద్వారా సాధ్యపడ్డాయి. అయితే.. కాలక్రమేణా కోర్టుల పరిమిత సామర్థ్యం, పునరుద్ధరణ నిష్పత్తి తగ్గడం వంటి కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఐబీసీ ఒక బలమైన సాధనంగా నిరూపితమైంది. దీనికితోడు ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన కఠినమైన నియంత్రణ మార్గదర్శకాలు, ప్రభుత్వరంగ బ్యాంకులకు భారీగా అందించిన రీక్యాపిటలైజేషన్ నిధులు, బ్యాంకుల విలీనాలు వంటి ఫోర్ ఆర్' (4ఆర్) వ్యూహం బ్యాంకింగ్ రంగానికి నూతన జీవం పోశాయి. ఈ సమగ్ర సంస్కరణల ఫలితంగానే నేడు దేశీయ బ్యాంకులు పటిష్టమైన మూలధన నిల్వలతో ముందుకు సాగుతున్నాయి.
ఈ పరిణామాలపై రాజకీయ మరియు ఆర్థిక వర్గాల్లో భిన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రతికూల ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నడుమ దేశ మూలాలు బలపడుతున్నాయనడానికి ఈ రేటింగ్ పెంపే నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతుండగా, మరోవైపు, అంతర్జాతీయ ఏజెన్సీలు అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని గతంలో కేంద్ర మంత్రులు బహిరంగంగానే విమర్శించారు. కొద్దిపాటి నాణ్యమైన అంశాలకు అత్యధిక వెయిటేజీ ఇస్తూ వాస్తవ వృద్ధిని విస్మరించడం సరికాదనే వాదనను ఆర్థిక సర్వేలు ప్రస్తావించాయి. అయితే.. జేసీఆర్ వంటి సంస్థల అప్‌గ్రేడ్‌లను ఉత్సాహంగా స్వాగతిస్తున్న తరుణంలోనే.. కొన్ని ముఖ్యమైన ఆర్థిక వాస్తవాలను విస్మరించకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ రుణ భారం ఇప్పటికీ నిర్దేశిత పరిమితుల కంటే ఎక్కువే ఉందనీ, జీడీపీతో పోలిస్తే సాధారణ ప్రభుత్వ రుణాలు అధిక స్థాయిలో కొనసాగుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయంలో వడ్డీ చెల్లింపుల వాటా భారీగా ఉండటం ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారం అని చెప్పవచ్చు. దేశంలో స్థూల ఆర్థిక లోటు కొంతమేర తగ్గినప్పటికీ, ఉపాధి కల్పన, యువతలో నిరుద్యోగ సమస్య ఇంకా సవాలుగానే ఉంది. 7 శాతానికి పైగా జీడీపీ వృద్ధి సాధిస్తున్నప్పటికీ, తగినన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించలేకపోవడం మధ్య కాలిక వ్యయ ఒత్తిళ్లకు దారితీస్తుందని రేటింగ్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ప్రపంచ బ్యాంకు వెలువరించే పాలనా సూచికల్లో భారత్ స్థానం మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు లభించే అవకాశం కలగడంతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక మరింత జోరందుకుంటుంది. అయితే దీనివల్ల పూర్తిగా సవాళ్లు తొలగిపోయినట్లు కాదు. రాబోయే రోజుల్లో మరింత కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, సంస్కరణల వేగాన్ని మరింత పెంచడం, సామాజిక రంగంలోని సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారానే భారత్ తన దీర్ఘకాలిక ఆర్థిక విశ్వసనీయతను సుస్థిరం చేసుకోగలదు. కేవలం ఒక రేటింగ్ పెంపుదలతో సంతృప్తి చెందకుండా, వాస్తవ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే అసలైన ప్రగతి సాధ్యమవుతుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[India Credit Rating JCR A, Japan Credit Rating Agency, India upgrade, Indian economy GDP growth, India Sovereign Rating]


