దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలుసా: ఐరాస వేదికగా ఇండియా ఏం చెప్పిందంటే.?
Published on: Thu Oct 22, 2026 12:15PM

కరుడు కట్టిన ఉగ్రవాది, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంవిషయంలోఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి రూపొందించిన నివేదికలో దొర్లిన తప్పులను ఇండియా తప్పుపట్టింది. ఖండించింది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నాడంటూ ఐరాస నివేదిక పేర్కొనడాన్ని ఇండియా ఖండించింది. ఇటువంటి తప్పుడుప్రచారం ఐరాస ప్రతిష్టను దిగజారుస్తుందనిహెచ్చరించింది.
ఐక్య రాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ జూలై నెలలో విడుదల చేసిన నివేదికలో, అల్-ఖైదాతో సంబంధాలున్న నేపథ్యంలో భద్రతా మండలి 2003లో డి కంపెనీ అధిపతి దావూద్ ఇబ్రహీంను ఉగ్రజాబితాలో చేర్చినట్లు పేర్కొంటూ, అతను భారత్‌లోనే ఉన్నట్లు పరోక్షంగా పేర్కొన్నారు. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి బృందంలోని ఫస్ట్ సెక్రటరీ రాఘూ పూరి మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి తప్పిదాన్నిఎత్తి చూపారు. దావూద్‌ను ఉగ్రవాద జాబితాలో చేర్చడానికి ఎంతో కాలం ముందే అతను దేశం నుంచి పారిపోయాడని ఆధారాలతో సహా వెల్లడించారు.
విదేశీ గడ్డపై తలదాచుకుంటూ అల్ ఖైదా, ఒసామా బిన్ లాడెన్‌తో సంబంధాలు కలిగి ఉన్నందువల్లనే అతనిని అంతర్జాతీయ ఉగ్రవాదులజాబితాలో చేర్చడం జరిగిందని రాఘూ పూరి గుర్తుచేశారు. నేటికీ అతను భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనీ, ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ తలదాచుకుని అంతమొందిన దేశంలోనే అంటే పాకిస్థాన్ లోనే దావూద్ కూడా నివసిస్తున్నాడని విస్పష్టంగా చెప్పారు.

1993 ముంబై వరుస పేలుళ్ల ఘటన తర్వాత నుంచే దావూద్ ఇబ్రహీం భారత్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని గుర్తు చేసిన రాఘూ పూరి ఆంక్షల కమిటీ జాబితాలో ఈ వాస్తవాలన్నీ స్పష్టంగా ఉన్నప్పటికీ, బాధ్యతాయుతమైన నివేదికలో వాటిని విస్మరించడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక ప్రతినిధుల కార్యాలయం నుంచి ఇలాంటి పొరపాట్లు జరగడం ఐక్యరాజ్య సమితి ప్రతిష్ఠను మసకబారుస్తుందని హెచ్చరించారు.
ఈ నివేదికలోని కొన్ని విభాగాల్లో స్పష్టమైన పక్షపత ధోరణి కనిపిస్తోందన్న రాఘూ పూరి ఈ కార్యాలయంపై వస్తున్న విమర్శలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చే దేశాలు, అంతర్జాతీయ సమాజం నుంచి తప్పించుకోవడానికి మానవ హక్కుల ముసుగును వాడుకోవడం పరిపాటిగా మారిందని పరోక్షంగా పాకిస్థాన్ ను పేర్కొన్నారు.
ఇదే సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ అంశాన్ని అనవసరంగా ప్రస్తావించగా, భారత బృందం దానిని తీవ్రంగా తిప్పికొట్టింది. సంకుచిత రాజకీయ లబ్ధి కోసమే పాకిస్థాన్ ఇలాంటి నిరుపయోగమైన ప్రచారాలకు పాల్పడుతోందని కొట్టిపారేసింది. జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేస్తూ, పాక్ ప్రతినిధి వ్యాఖ్యలకు అంతకంటే ప్రాధాన్యత ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
[India Condemn UN Report On Dawood Ibrahim, India UN Statement, Pakistan Terrorism, Raghu Puri UN, Mumbai Blasts, Most Wanted Criminal, Telugu One]


