రష్యా వ్యాక్సిన్ కోసం భారత్ రిక్వెస్ట్.. పరిశీలిస్తున్నామన్న రష్యా

కరోనా ప్రపంచం మొత్తం అతలాకుతలమౌతున్న సమయంలో సైలెంట్ గా రష్యా తన వ్యాక్సిన్ ను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలతో ట్రయల్స్ కాల పరిమితిని కుదించి ఈ వ్యాక్సిన్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యాక్సిన్ పనితీరుపై డబ్ల్యుహెచ్ఓ తో పాటు, ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను స్వయంగా పుతిన్ కుమార్తెకు కూడా ఇవ్వడంతో నమ్మకం ఏర్పడి దీనిని తమకు కూడా అందించాలని భారత్ సహా మరో 20 దేశాలు కోరాయి. ఈ విషయాన్ని స్వయంగా రష్యా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. "స్పుత్నిక్ వీ" గా పిలవబడుతున్నఈ వ్యాక్సిన్ కోసం భారత్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ, క్యూబా వంటి దేశాలు తమను కోరాయని ఆ ప్రకటనలో తెలిపింది.

 

రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఎఫ్) సహకారంతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ను ఈరోజు తొలిసారిగా 2 వేల మంది ప్రజలకు ఇవ్వనున్నారు. అంతేకాకుండా సెప్టెంబర్ లో వ్యాక్సిన్ తయారీని భారీ ఎత్తున మొదలుపెట్టి, ఈ సంవత్సరం చివరకు దాదాపు 20 కోట్ల డోస్ లను తయారు చేసి అందించాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యాక్సిన్ ఫార్ములాను కనుక తమకు అందిస్తే, మేము కూడా తయారు చేస్తామంటూ కొన్ని దేశాల ఫార్మా కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయని, ఐతే ఈ విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నామని రష్యా పేర్కొంది. ఇక రాబోయే ఐదేళ్ల కాలంలో వివిధ దేశాల సహకారంతో ఏటా 50 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేస్తామని ఆర్డీఐఎఫ్ చీఫ్ కిరిల్ దిమిత్రీవ్ తెలిపారు.