TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

IND vs SL: టీమిండియా గెలుపును అడ్డుకున్న దినుష రికార్డు సెంచరీ!

Published on: Fri Aug 28, 2026 10:36AM

కొలంబో టెస్టులో ఘనవిజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్  WTC 2025-27  పాయింట్ల పట్టికలో తమ ఆధిపత్యాన్ని మరింత బలపరచాలని భావించిన భారత క్రికెట్ జట్టు ఆశలకు శ్రీలంక యువ ఆటగాడు సొనాల్ దినుష తీవ్ర నిరాశ మిగిల్చాడు. పటిష్టమైన భారత బౌలింగ్ దళాన్ని ఐదో రోజు దాదాపు రెండు సెషన్ల పాటు ఏకాగ్రతతో ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ అద్భుతమైన అసమాన పోరాటంతో కొలంబో టెస్టును డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి రెండు రోజులు మ్యాచ్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి, విజయం నల్లేరుమీద నడకే అనుకున్న టీమిండియాను లంక దిగువ వరుస బ్యాటర్లు తీవ్రంగా నిరోధించారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు తరఫున దేవ్‌దత్ పడిక్కల్ 117 రన్స్, ధ్రువ్ జురెల్ 115 రన్స్‌తో భారీ శతాబ్దాలు సాధించడంతో భారత్ 503/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన శ్రీలంక ఫాలో ఆన్ గండంలో పడింది. అయితే ద్వితీయ ఇన్నింగ్స్‌లో లంక పట్టుదలగా నిలబడింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ పసిందు సూర్యబండార 92 పరుగులతో అండగా నిలవగా, సొనాల్ దినుష అజేయంగా 133 పరుగులు సాధించి భారత్ విజయాన్ని పూర్తిగా అడ్డుకున్నాడు. 264 బంతులు ఎదుర్కొన్న దినుష ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

ఫాలో ఆన్ ఆడుతూ ఒకే టెస్టు మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతాబ్దాలు (103, 133 నాటౌట్) బాదిన అరుదైన రికార్డును దినుష తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో విజయ్ హజారే (1948), యాండీ ఫ్లవర్ (2001) తర్వాత ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మూడో బ్యాటర్‌గా దినుష చరిత్ర సృష్టించాడు. అతనికి ఆఖరి వరుస బ్యాటర్లు నువాంత (46), లహిరు కుమార (12) తగినంత సహకారం అందించారు.

 

 

 

sonal dinusha twin centuries colombo test,india vs sri lanka test series result.