TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏఐ టెక్నాలజీతో కాపీయింగ్ ఆరోపణలు.. ఐఐటి ముంబై విద్యార్థి ఆత్మహత్య.!

Published on: Sat Sep 19, 2026 3:04PM

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబేలో విషాద ఘటన చోటు చేసుకుంది.  ఏఐ సాంకేతికతను  ఉపయోగించి కాపీ కొట్టేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఎదుర్కొన్న ఓ   విద్యార్థి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన  ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, కఠినమైన నిబంధనలు, అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలకు తావిచ్చింది. వివరాలిలా ఉన్నాయి.   ఐఐటీ బాంబేలో   బీటెక్ సెకెండియర్ చదువుతున్న ఒక  విద్యార్థి   పరీక్ష హాల్ లో   మొబైల్ ఫోన్‌  వినియోగిస్తున్నట్లు ఇన్‌స్ట్రక్టర్ గుర్తించారు. ఆ ఫోన్ సహాయంతో ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీ టూల్‌లో అప్‌లోడ్ చేసి, ప్రశ్నలకు జవాబులు వెతికేందుకు సదరు విద్యార్థి ప్రయత్నించినట్లు నిర్ధారించారు. 

అయితే ఈ ఉల్లంఘన వెలుగులోకి వచ్చిన వెంటనే.. నిబంధనల ప్రకారం ఎలాంటి అధికారిక క్రమశిక్షణా చర్యలు గానీ, సస్పెన్షన్ ప్రక్రియ గానీ చేపట్టలేదు. విషయాన్ని విభాగాధిపతి,  ఇన్‌స్ట్రక్టర్ స్వయంగా ఆ విద్యార్థితో మాట్లాడి,  కౌన్సిలింగ్ ఇచ్చినట్లు యాజమాన్యం చెబుతోంది. ఈ చిన్న పొరపాటు కారణంగా విద్యార్థి అకడమిక్ భవిష్యత్తుకు ఎలాంటి భంగం కలగదని, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవని వారు అతడికి భరోసా కూడా ఇచ్చారు.  ఇదంతా జరిగిన తరువాత సదరు విద్యార్థి   తన హాస్టల్ గదికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం తన హాస్టల్ గదిలో విగతజీవుడిగా పడి ఉండటాన్ని తోటి విద్యార్థులు గుర్తించారు.  ఈ ఘటన శుక్రవారం (సెప్టెంబర్ 18) జరిగింది. శనివారం (సెప్టెంబర్ 19)న విద్యార్థి మృతికి నిరసనగా ఐఐటీ బాంబే క్యాంపస్ విద్యార్థులు నిరసనకు దిగారు.   విద్యార్థిపై ఎలాంటి  చర్యలు తీసుకోలేదని యాజమాన్యం చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం అధికారుల నుంచి తీవ్రమైన హెచ్చరికలు, మానసిక వేధింపులు ఎదురై ఉంటాయని విద్యార్థి సంఘాలు   ఆరోపణలు గుప్పించాయి.  
మృతుడి తల్లిదండ్రులు సైతం  తమ కుమారుడి మృతికి సంస్థ అధికారుల వేధింపులే కారణమని వారు ఆరోపించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాదని, క్యాంపస్‌లో ఎదురైన అవమాన భారమే అతడిని ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని ఆరోపించారు.  

ఈ నిరసనల ఉధృతి నేపథ్యంలో ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ షిరీష్ కేదార్ క్యాంపస్‌లో విద్యార్థులతో ఒక ఓపెన్ హౌస్ సమావేశాన్ని నిర్వహించారు.  విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. క్యాంపస్‌లో విద్యార్థుల మానసిక సంక్షేమాన్ని కాపాడేందుకు, వారికి అత్యవసర సమయాల్లో మెరుగైన కౌన్సిలింగ్, భరోసా అందించేందుకు నూతన విధివిధానాలను రూపొందిస్తామని   హామీ ఇచ్చారు.  

[IIT Bombay Student Sucide, ChatGPT Copying Controversy, AI Tools, Exams India, IIT Bombay Protests, Telugu One]