TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐఐటీ విద్యార్థులకు షాక్: ఒరాకిల్ సహా 22 కంపెనీల ప్లేస్‌మెంట్ ఆఫర్లు రద్దు!

Published on: Sat Sep 26, 2026 11:44AM

దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs) విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ దిగ్గజ సంస్థల నుంచి జాబ్ ఆఫర్లు సాధించి, ఎంతో ఆశతో తమ భవిష్యత్తుపై ధీమాతో ఉన్న వందలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు కంపెనీలు హ్యాండ్ ఇచ్చాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగ ఆఫర్లను అమలు చేయకుండా వెనక్కి తగ్గిన 22 ప్రముఖ కంపెనీలపై ఐఐటీ యాజమాన్యాలు అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) సహా పలు ప్రముఖ స్టార్టప్ సంస్థలు ఈ నిర్ణయంతో కఠిన చర్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీలతో రాబోయే రెండు ప్లేస్‌మెంట్ సీజన్లలో ఎటువంటి సహకారం అందించకూడదని, వాటికి ప్రాంగణ నియామకాల నుంచి ప్రవేశం కల్పించకూడదని ఐఐటీల ఆల్ ఐఐటీస్ ప్లేస్‌మెంట్ కమిటీ (AIPC) స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది.

2026 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరాల్సిన విద్యార్థుల విషయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల పరిధిలో సుమారు 150కి పైగా ఉద్యోగ ఆఫర్లు రద్దవ్వడం లేదా వెనక్కి తీసుకోవడం జరిగింది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర అయోమయంలో పడింది. కొన్ని ప్రముఖ కంపెనీలు ఒక్కో ఐఐటీ క్యాంపస్ నుంచి దాదాపు 10 నుండి 15 ఉద్యోగ ఆఫర్లను ఒక్కసారిగా ఉపసంహరించుకున్నట్లు ఐఐటీ గువాహటి అసోసియేట్ ప్రొఫెసర్, ఏఐపీసీ కన్వీనర్ జాన్ జోస్ వెల్లడించారు. వీటిలో ఒక్క అమెరికన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ సంస్థే దాదాపు 40 మంది ఐఐటీ విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్లను అమలు చేయకపోవడం గమనార్హం. ఒరాకిల్ సంస్థ ప్రస్తుతం గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను భారీగా పెంచుతోంది. ఇందులో భాగంగానే 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ వ్యయాన్ని మరొక 700 మిలియన్ డాలర్లు పెంచి, మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు చేర్చింది. ఈ క్రమంలోనే ఖర్చులు తగ్గించుకునేందుకు ఫ్రెషర్ల నియామకాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐఐటీ ప్లేస్‌మెంట్ కమిటీ ఇప్పటికే ఈ కంపెనీలతో పలు విడతలుగా చర్చలు జరిపింది. గడిచిన జూన్ నెలలోనే ఒరాకిల్, ఇంటర్వ్యూ కిక్‌స్టార్ట్, సూపర్‌ఏజీఐ వంటి 10కి పైగా కంపెనీలకు హెచ్చరిక లేఖలు జారీ చేసింది. ఆఫర్లు రద్దు చేసిన విద్యార్థులను తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని లేదంటే వారికి పరిహారంగా మూడు నెలల జీతానికి సమానమైన సొమ్మును చెల్లించాలని ప్రతిపాదించింది. కంపెనీలకు మొదట ఆగస్టు 15 వరకు, ఆ తర్వాత సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చినా కూడా స్పందించకపోవడంతో ఏఐపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్యను అధికారికంగా 'బ్లాక్‌లిస్ట్' అనకుండా 'నాన్-కోఆపరేషన్' (సహకరించకపోవడం) ప్రక్రియగా పేర్కొనాలని కమిటీ నిర్ణయించింది. సెప్టెంబర్ 30 నాటికి ఈ నిర్ణయాన్ని సంబంధిత 22 కంపెనీలకు అధికారికంగా తెలియజేయనున్నారు. దీనివల్ల 2027, 2028 బ్యాచ్‌లకు చెందిన ఐఐటీ విద్యార్థులను ఈ కంపెనీలు క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారా నియమించుకునే అవకాశం ఉండదు.

గత ఏడాది కేవలం 10 నుండి 11 కంపెనీలు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగ ఆఫర్లు కోల్పోయిన విద్యార్థులకు ఆసరాగా నిలిచేందుకు ఐఐటీ ప్లేస్‌మెంట్ సెల్స్ రంగంలోకి దిగాయి. మిగిలిన రిక్రూటింగ్ కంపెనీలకు వీరి రెజ్యూమ్‌లను పంపి, ఉన్న ఖాళీల్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ ప్రత్యేక ప్రయత్నాల వల్ల ఇప్పటివరకు ప్రభావితమైన విద్యార్థుల్లో దాదాపు 20 నుండి 30 శాతం మందికి తిరిగి ఇతర సంస్థల్లో ఉద్యోగాలు లభించాయని జాన్ జోస్ తెలిపారు. త్వరలోనే ఐఐటీల్లో కొత్త ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ, ఏఐపీసీ తీసుకున్న ఈ కఠిన చర్య రిక్రూటింగ్ సంస్థలలో జవాబుదారీతనాన్ని పెంచుతుందని, విద్యార్థుల భవిష్యత్తుకు భద్రత కల్పిస్తుందని భావిస్తున్నారు.

 

 

 

[IIT Placements, IIT Students, Campus Placements, Oracle, AIPC, Job Offers, Job Offer Withdrawals, IIT Recruitment, Non-Cooperation Action, 2026 Placements]