సవాళ్లు, ఒత్తిళ్లు, బదలీలు: ఐఏఎస్ ముగ్ధా సిన్హా ప్రస్థానం.. నిజాయితీయే కొలమానం.!
Published on: Mon Nov 2, 2026 8:29AM

ఆదర్శానికే ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారిణి ప్రస్థానం ఇది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ, విధినిర్వహణలో రాజీపడి నిబంధనలను తుంగలో తొక్కి ఏలిన వారి ప్రయోజనాలు కాపాడటం కోసం సర్వీస్ రూల్స్ ను మరిచి ప్రవర్తించే సివిల్ సర్వెంట్లకు ఈ ఐఏఎస్ అధికారిణి ప్రస్థానం గుణపాఠం. ఒత్తిడులు, సవాళ్లు, బెదరింపులు, ఎక్కడా స్థిరంగా ఉండనీయకుండా వరుస బదిలీలతో ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా.. ఎక్కడా రాజీపడకుండా, విధినిర్వహణలో నిజాయితీకి, నిక్కచ్చి తనానికీ నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ముగ్ధా సింగ్ సివిల్ ఓ ఆదర్శం.
ప్రభుత్వ ఉద్యోగాలలో బదలీలు అతి సహజం. అయితే, కొందరు అధికారుల బదలీల ప్రస్థానం ప్రత్యేకంగా ఉంటుంది. విధినిర్వహణలో ముక్కుసూటి తనం, నిక్కచ్చిగా వ్యవహరించడం, అవినీతి, అక్రమాలను ఇసుమంతైసా సహించకుండా నిలబడటం.. పెద్దపెద్ద వారి నుంచి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించమని వచ్చిన ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా నిలబడటం.. ఇలాంటి కారణాలతో కొందరు అధికారులకు ట్రాన్స్ ఫర్లు నిత్యకత్యంగా మారిపోతుంటాయి. అదిగో అలాంటి ప్రత్యేక అధికారిణి.. రాజస్థాన్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ముగ్ధా సిన్హా. 15 ఏళ్ల సర్వీసులో ఆమెను ఎక్కడా కూడా పట్టుమని పది నెలలు స్థిరంగా ఉంచకుండా బదలీల మీద బదలీలు ఎదుర చేశారు. 15 ఏళ్ల సర్వీసులో ముగ్ధా సిన్హా ఏకంగా 14 బదలీలు ఎదుర్కొన్నారు. ఇందుకు కారణం ఆమె నిజాయితీ, ముక్కుసూటి తనం. విధినిర్వహణలో నిబంధనల ప్రకారం పని చేయడం వినా ఎవరి ఒత్తిడులకూ తలొగ్గకపోవడమే.
ముగ్ధా సిన్హా నాలుగేళ్ల వయస్సులో ఆమె తండ్రి గురు స్వరూప్ సిన్హా భారత వైమానిక దళంలో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తూ లడఖ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు కుమార్తెలను వారి తల్లి ఎంతో కష్టపడి పెంచారు. చిన్నతనం నుంచే దేశ భక్తి, ప్రజా సేవే లక్ష్యం అన్న విలువలు ముగ్థా సిన్హాలో గట్టిగా ఉండేవి. ఈ లక్షణాలన్నీ ముగ్థా సిన్హాకు ఆమె తల్లి ద్వారా అలవడ్డాయి, తనను ఐఏఎస్ గా చూడాలన్న తల్లి కలను ముగ్థా సిన్హా నెరవేర్చారు.

ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ముగ్ధా సిన్హా, ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్య అభ్యసించారు. మొదట విదేశాంగ సేవల్లో చేరాలని భావించినప్పటికీ, ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం సివిల్ సర్వీసెస్ ద్వారానే లభిస్తుందని భావించి ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. 1999 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా ఆమె బాధ్యతలు చేపట్టారు.
తన కెరీర్లో అజ్మీర్ సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా, జైపూర్ అదనపు కలెక్టర్‌గా, బూందీ, హనుమాన్‌గఢ్, ఝుంఝునూ, శ్రీగంగానగర్ వంటి పలు జిల్లాల్లో కలెక్టర్‌గా సేవలందించారు. ఈ కాలంలో అక్రమ మైనింగ్, నిత్యావసర సరుకుల అక్రమ రవాణా, గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ వంటి అక్రమ దందాలపై ఆమె కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. ఆ కారణంగా ఆమె అనేక ఒత్తిళ్లు, బెదరింపులు కూడా ఎదుర్కొన్నారు. అయితే లెక్క చేయకుండా నిజాయితీగా, ప్రజా సేవే పరమావధి అంటూ ముందుకు సాగారు. ఆ కారణంగా ఆమెను ఎక్కడా స్థిరంగా ఉంచకుండా బదలీల మీద బదలీలు చేశారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్నిసార్లు బదిలీ వేట్లు పడినా ముగ్థా సిన్హా మాత్రం విధి నిర్వహణలో ఇసుమంతైనా రాజీపడకుండా ముందుకు సాగారు. సాగుతున్నారు. ముగ్థా సిన్హా ప్రస్థానం.. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.
[IAS Mugdha Sinha, 14 Transfers, !5 Years Service, Pnspiring Journey, Public Service, TeluguOne]


