అమెరికాలో హైదరాబాద్ యువతి అనుమానాస్పద మృతి..!
Published on: Wed Aug 26, 2026 9:25PM

అమెరికాలోని మేరీల్యాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ మృతి వెనుక కుట్ర దాగి ఉందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయిన అర్జున్ శర్మ నిఖితను ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి హత్య చేశాడని, ఈ దారుణంలో ఆయన తల్లి పాత్ర కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి అరెస్ట్‌పై అమెరికా అధికారులు అధికారిక ప్రకటన ఇవ్వకుండా మౌనం వహించడాన్ని తప్పుబట్టిన కుటుంబ సభ్యులు, నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి సమగ్ర విచారణ జరపాలన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
అర్జున్ శర్మ ఆగస్టు, సెప్టెంబర్ 2025లో తన ఉద్యోగాన్ని కోల్పోయారన్నారు. అప్పటి నుంచి మా కుమార్తె మరణించే వరకు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలుకుతూ మా అమ్మాయి దగ్గర, మా కుటుంబం వద్ద పదే పదే డబ్బులు అప్పుగా తీసుకోవడం మొదలుపెట్టారన్నారు. ఆయన కారణంగా మా కుమార్తె అప్పటికే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురైందన్నారు. ఆమె నుంచి మా కుటుంబం నుంచి డబ్బు తీసుకోవడం కొనసాగించారన్నారు. ఆమె చనిపోయే ముందు నెలల వరకు కూడా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నారు.
ఆయన తల్లి రచన శర్మకు ఈ లావాదేవీలన్నీ పూర్తిగా తెలుసన్నారు. ఆమె స్వయంగా మా కుటుంబానికి పలు సందర్భాల్లో డబ్బు తిరిగి చెల్లించిందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆమెకు ఈ ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసని స్పష్టమవుతుందన్నారు. మా కుమార్తె సురక్షితంగా లేదని, ఇది తల్లి-కొడుకులు ఇద్దరూ కలిసి పథకం ప్రకారం చేసిన ముందస్తు హత్యేనని భావిస్తున్నామన్నారు.
తను నమ్మిన వ్యక్తి చేతిలోనే మోసపోతూ మా కుమార్తె ఈ ఆర్థిక భారాన్ని మోసిందన్న విషయం మాకు తీవ్ర వేదనను కలిగిస్తుందన్మారు. ఈ పరిస్థితులు మా అమ్మాయి మంచి వాతావరణంలో లేదని భావించామన్నారు. ఏం జరుగుతోందో ఆమె స్నేహితులు కొందరు గమనించి, ఆయనకు దూరంగా ఉండాలని ఆమెకు సూచించారన్నారు తల్లిదండ్రులుగా మేము ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందామన్నారు. ఆమె ఎదుర్కొన్న ఆర్థిక దోపిడీ, ఒత్తిడి చివరకు మా కుమార్తెను ఘోరంగా బలి తీసుకుంటుందని ఊహించలేదన్నారు.
మా కుమార్తెను చంపిన వెంటనే ఆమె ఖాతా నుంచి ఆర్థిక లావాదేవీలు జరగడం అత్యంత దిగ్భ్రాంతికరం అన్నారు. ఆ తర్వాత ఆయన మిస్సింగ్ కేసు పెట్టాడన్నారు. కానీ అక్కడి అధికారులు ఆమె అదృశ్యం వెనుక ఉన్న తీవ్రతను సరిగ్గా గుర్తించలేదని భావిస్తున్నామన్నారు. అది డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకల సమయం కావడం వల్ల మా కుమార్తె కేసుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత బాధాకరం అన్నారు. మా కుమార్తె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. మాకు సరైన సమాచారం తెలియక ముందే, ఆమె ఫొటోలను ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తూ ఆమెను తప్పుడు రీతిలో చిత్రీకరించారన్నారు. అమెరికా అధికారుల నుంచి సమాచారం అందలేదన్నారు.
నిందితుడు తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఆయన తల్లి రక్షణగా ఉంటూ, నేరానికి తగిన శిక్ష పడకుండా తప్పించుకోవడానికి సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ఆమె పాత్రపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నామన్నారు. లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. ఆ తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిందన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేసిందన్నారు.
మా కుటుంబం డీసీపీ రక్షిత మూర్తిని సంప్రదించిందన్నారు. ఆమె, నిందితుడి అరెస్ట్ గురించి మాకు సమాచారం అందించడమే కాకుండా, ఈ మొత్తం వ్యవహారంలో మాకు నిరంతరం అండగా ఉంటూ, సరైన మార్గదర్శకత్వం చేస్తూ సంబంధిత అధికారులు, భాగస్వామ్య వర్గాలతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. మా కుమార్తెకు న్యాయం చేయాలని అహర్నిశలు పోరాడామన్నారు. ఈ కష్ట సమయంలో మా కుటుంబానికి ఎంతో అండగా నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పలువురు బీజేపీ నాయకులకు, ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యులకు, ఎంసీఆర్ఎఫ్ ఫౌండేషన్‌కు, సీబీఐ, మహిళా కమిషన్‌కు, ఐపీఎస్ అధికారులు చారు సిన్హా, రక్షిత మూర్తి, ఉద్యమకారులు దివ్య వడ్లపూడి, డాక్టర్ గోవిందరాజులు వడ్లపూడికి కృతజ్ఞతలు తెలిపారు.
Hyderabad woman dies in America, Nikhitha godisala, Cyberabad Police, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy, DCP Rakshit Murthy


