భాగ్యనగరం గొంతెండుతోంది: అడుగంటిన భూగర్భ జలాలు.. సమస్య పరిష్కారానికి ప్రణాళికలేవీ.!
Published on: Thu Oct 15, 2026 2:31PM
హైటెక్ సిటీ.. అంతర్జాతీయ ఐటీ సంస్థలు.. ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు.. నిత్యం విస్తరిస్తున్న కొత్త కాలనీలు! ఇదీ అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ దృశ్యం. అయితే విశ్వనగరంగా మనం చెప్పుకునే హైదరాబాద్ భీకరమైన నీటి కొరతతో ఇబ్బందులు పడుతోంది. తాగునీటి కొరతతో భాగ్యనగరం గొంతెండుతోంది. తాగునీటి కోసం హైదరాబాదీయులు చాలా వరకూ ట్యాంకర్లపైనే ఆధాకపడాల్సిన పరిస్థితి. ఒకవైపు భాగ్యనగరం జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంటే.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నగరానికి అందుతున్న నీటికి, ప్రజల అవసరాలకు మధ్య అగాధం, అంతరం అంతకంతకూ పెరిగిపోతోంది.
హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ జనాభా వేగంగా పెరుగుతోంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు, కొత్తగా ఏర్పడుతున్న నివాస సముదాయాలు, వాణిజ్య సంస్థలు, ఆసుపత్రులు.. అన్నీ నీటి అవసరాన్ని పెంచుతున్నాయి. అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం, నగరం, శివారు ప్రాంతాలకు కలిపి రోజుకు సుమారు 735 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న సరఫరా 585 మిలియన్ గ్యాలన్లు మాత్రమే. అంటే రోజుకు రమారమి 150 మిలియన్ గ్యాలన్ల కొరత ఉంది.
అయితే ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే.. ఈ నీటి కొరత అన్నది నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. కాలనీలకు నల్లా నీరు అందుతున్నా, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరా అంతంతమాత్రమే. ముఖ్యంగా వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను విస్తరించలేదు.
నీటి కొరతకు మరో ప్రధాన కారణం భూగర్భ జలాలపై అధికంగా ఆధారపడటం. నల్లా నీరు సరిపోని కుటుంబాలు బోర్లను ఆశ్రయిస్తున్నాయి. అయితే నీటి వినియోగం విపరీతంగా పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఫలితం బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో జనాలకు ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి ఎదురౌతోంది.
2ఈ ఏడాది మే చివరి వారంలో హైదరాబాద్లో రోజువారీ ట్యాంకర్ బుకింగ్లు 15 వేలు దాటాయి. అక్టోబర్లోనూ రోజుకు సుమారు 6 వేల 500 ట్యాంకర్లు బుకింగ్లు నమోదవుతున్నాయి. సాధారణంగా వేసవిలో పెరిగే డిమాండ్ వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగడం భాగ్యనగరంలో నీటి ఎద్దడికి అద్దం పడుతోంది.
ట్యాంకర్ నీటిపై ఆధారపడటం కేవలం సరఫరా సమస్య మాత్రమే కాదు.. సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా భారంగానూ పరిణమిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో ట్యాంకర్ల కోసం చేసే ఖర్చు మెయింటెయినెన్స్ చార్జీలను గణనీయంగా పెంచుతోంది. నీటి సమస్యను ప్రతి వేసవిలో తాత్కాలికంగా పరిష్కరించడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. దీని వల్ల ఏ ఏటి కా యేడు సమస్య పెరిగిపోతున్నది. తాత్కాలిక పరిష్కారాలతో సరిపెట్టకుండా, శాశ్వత పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త నీటి వనరుల అభివృద్ధి, సరఫరా పైపులైన్ల విస్తరణ, లీకేజీల నియంత్రణ, వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పరిరక్షణ వంటి చర్యలను పటిష్టంగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
.webp)
అలాగే అధికంగా భూగర్భ జలాలను వినియోగించే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఇక పోతే ప్రజా భాగస్వామ్యం లేకుండా నీటి భద్రత సాకారం అయ్యే అవకాశం ఇసుమంతైనా లేదు. ఇళ్లలో నీటి వృథాను తగ్గించడం, లీకేజీలను వెంటనే సరిచేయడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతల ఏర్పాట్లు వంటివి జనం స్వచ్ఛందంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశ్వనగరం విస్తరణ ఆపడం సమస్యకు పరిష్కారం ఎంత మాత్రం కాదు.. అదే సమయంలో విస్తరిస్తున్న నగరానికి నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. , ఉన్న వనరులను ఎలా సంరక్షించాలన్నదానిపై దృష్టి సారించాలి.
[Hyderabad Water Crisis, Ground Water Levels, Water Tankers, Drinking Water Hyderabad, Telugu One]


