కొడుకు పుట్టలేదని భార్యకు ట్రిపుల్ తలాక్...!
Published on: Sun Nov 22, 2026 3:24PM

పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్నో ఆశలు.. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇంట్లో చిన్నారుల నవ్వులు.. కానీ అదే ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఆ తండ్రికి భార్యపై ప్రేమ తగ్గిపోయిందా..? తనకు కొడుకు కావాలని, కూతుళ్లు వద్దంటూ భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ సందేశం పంపినట్లు హైదరాబాద్ సైదాబాద్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
సైదాబాద్ లోకాయుక్త కాలనీకి చెందిన నిషాంత్ ఆఫ్రీన్ (37)కు, మలక్‌పేట సలీంనగర్‌కు చెందిన మహమ్మద్ అలీ అర్షద్ (40)తో 2015 ఆగస్టులో వివాహమైంది. పెళ్లయి కొత్త జీవితం ప్రారంభించిన ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య కుటుంబ వివాదాలు కోర్టు వరకు వెళ్లాయి. పరస్పర ఫిర్యాదులతో కేసులు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గత నెల 24న రాత్రి అర్షద్ తనకు ఫోన్ చేసి, డిసెంబర్‌లోగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆఫ్రీన్ తన ఫిర్యాదులో పేర్కొంది. కేసులు వెనక్కి తీసుకోకపోతే తనను వదిలేస్తానని హెచ్చరించినట్లు ఆరోపించింది. అంతేకాదు, తనకు థాయ్‌లాండ్‌లో ఉద్యోగం వచ్చిందని, ఇకపై భార్యతో పాటు పిల్లల అవసరం లేదని చెప్పినట్లు మరో కథనంలో పేర్కొంది.
అయితే ఆ మాటలతోనే ఆగలేదు. మరుసటి రోజే ఫోన్‌లో ఓ సందేశం పంపినట్లు బాధితురాలు ఆరోపించింది. “నువ్వు నాకు నచ్చడం లేదు.. నాకు కొడుకు కావాలి, కూతుళ్లు వద్దు. అందుకే నీకు తలాక్ ఇస్తున్నాను. తలాక్.. తలాక్.. తలాక్” అంటూ సందేశం పంపినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా ఉండాల్సిన వ్యక్తి.. వారే వద్దంటూ చెప్పాడన్న ఆరోపణలు ఈ ఘటనలో మరింత ఆవేదన కలిగిస్తున్నాయి.
ఇది కూడ చదవండి: అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్‌లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.!
తన భర్త ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అత్త షహానా బేగం, ఆడపడుచు అర్షియా అలియాస్ సనా ప్రోద్బలం ఉందని కూడా ఆఫ్రీన్ ఆరోపించింది. భర్తతో పాటు వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది.ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ చట్టం అమల్లో ఉన్నప్పటికీ, ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా మగబిడ్డ కావాలన్న పట్టుదలతో ఆడపిల్లల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు సమాజం ఆలోచించాల్సిన అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చాయి. ఇద్దరు చిన్నారులకు తండ్రి ప్రేమ, భద్రత అవసరమైన సమయంలో.. వారి భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, ఫోన్ సందేశాలు సహా అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
మీకు నచ్చవచ్చు: ఓట్ల తొలగింపుపై సమరశంఖం.. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ పిలుపు.!
మీకు నచ్చవచ్చు: పసిడి ధరలు పతనం..కొనుగోలుకు ఇదే సరైన సమయమా..కియోసాకి ఏమన్నారంటే..!


