TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో 9 మందికి జీవిత ఖైదు.. హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు తీర్పు.!

Published on: Fri Sep 18, 2026 11:44AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో హైదరాబాద్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు   సంచలన తీర్పు  వెలువరించింది. 2019లో వెలుగులోకి వచ్చి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఉదంతంలో విచారణ పూర్తి కాగా, నేరం రుజువైన  9 మంది నిందితులకు జీవిత ఖైదును విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును ప్రకటించింది. 

ఇందుకు సంబంధించి  వివరాలిలా ఉన్నాయి. బంగ్లాదేశ్‌ నుంచి   అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్ కొనసాగింది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ నుంచి పలువురు మహిళలను అక్రమ మార్గాల్లో  సరైన పత్రాలు లేకుండా భారత్‌లోకి అక్రమంగా తరలించారు. నగర శివారులోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో ఈ కేసు   వెలుగులోకి వచ్చింది. బాధితురాళ్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఈ ఘరానా ముఠా వారిని దగా చేసింది.

ఉద్యోగాల ఆశ చూపించి మోసం చేసిన ఈ కేటుగాళ్లు, ఆ తర్వాత ఆ మహిళలను బలవంతంగా అసాఘిక కార్యకలాపాలు,  వ్యభిచార కూపంలోకి నెట్టారు. నిందితుల అఘాయిత్యాలకు బలైన బాధితుల ఫిర్యాదులు,  ఇతర ఆధారాలతో ఈ రాకెట్ గుట్టు రట్టయింది. కేసు తీవ్రత,  అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉండటాన్ని గమనించిన ఉన్నతాధికారులు, ఈ కేసును దర్యాప్తు చేయడానికిఎన్ఐఏకి  అప్పగించారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో  దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఏ1 నుంచి ఏ12 వరకు మొత్తం 12 మంది నిందితులపై ఎన్‌ఐఏ అధికారులు   కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానంలో ఇరువర్గాల వాదనలు పూర్తిగా ముగిశాయి. సమర్పించిన సాక్ష్యాధారాలు,   వాదనలను సమగ్రంగా పరిశీలించినకోర్టు..  నిందితులపై నేరం నిర్ధారణ కావడంతో  మొత్తం 12 మంది నిందితుల్లో   9 మందికి జీవిత ఖైదును ఖరారు చేస్తూ  సంచలన నిర్ణయం తీసుకుంది.  శిక్ష పడిన ఆ 9 మంది నిందితులలో  8 మంది బంగ్లాదేశ్ పౌరులు కావడం గమనార్హం.  


[Hyderabad NIA Court, Human Trafficking Case, Life Imprisonment, Bangladeshi Nationals, NIA Special Court, Telugu One]