TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌లో కల్తీ పాల దందా గుట్టురట్టు.. పోలీసుల దాడిలో విస్తుపోయే నిజాలు.!

Published on: Fri Nov 6, 2026 2:06PM

ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నగరానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో వెలుగు చూసిన ఒక సంచలన ఉదంతం అందరినీ విస్మయానికి గురిచేసింది.

 ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, రసాయనాలను ఉపయోగించి నకిలీ పాలను తయారు చేస్తున్న ఒక భారీ కల్తీ దందాను స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు. ఈ మెరుపు దాడిలో బయటపడిన నిజాలు సామాన్య ప్రజలను కలవరపెడుతున్నాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోచారంలో కల్తీ పాలను తయారు చేసి అమాయక ప్రజలకు సరఫరా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దాడుల్లో భాగంగా పాల వ్యాపారి అండే శ్రీశైలం (43)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ తయారీ కేంద్రంపై జరిపిన సోదాల్లో అధికారులు ఖంగుతినే వాస్తవాలు కనుగొన్నారు. 

ప్రధానంగా ఈ కల్తీ దందాలో మనుషుల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేవలం రంగు, చిక్కదనం కోసమే కాకుండా ప్రమాదకరమైన ధోల్పూర్ పాల పొడిని, రసాయనాలను నీటిలో కలిపి పాలుగా మారుస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.   ఈ ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీగా కల్తీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

సంఘటన స్థలంలో దాదాపు 100 లీటర్ల తయారైన కల్తీ పాలను, ఒక లీటరు స్వచ్ఛమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని, అలాగే ఒక్కోటి ఒక కిలో బరువున్న సుమారు 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ రసాయన పాలను స్థానిక మార్కెట్లతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు నిత్యం సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 

చిన్న పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతిరోజూ ఇళ్లలో సేవించే పాలు ఇంత ప్రమాదకరంగా మారుతుండటం చూసి నగరవాసులు షాక్ అవుతున్నారు. నిందితుడిపై తగిన కేసులు నమోదు చేసి, ఈ కల్తీ నెట్‌వర్క్‌ వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు కూలంకషంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.   

 

ఇది కూడా చదవండి : హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కామన్ పాస్ ధరలు భారీగా తగ్గింపు.!

 

 

 

[ Hyderabad milk adulteration, SOT police raid, Pocharam fake milk, hydrogen peroxide in milk, Rangareddy crime news, adulterated milk seized, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Ananand, Telugu One, Telugu News ]