TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నష్టాల ఊబిలో హైదరాబాద్ మెట్రో.. ఆరు నెలల్లోరూ.405 కోట్లు.. రెండో దశ విస్తరణపై నీలినీడలు.?

Published on: Mon Oct 19, 2026 3:59PM

మహానగర వాసుల ప్రయాణ కష్టాలను తీరుస్తూ నగరంలో పరుగులు పెడుతున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు   తీవ్ర  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాల ఊబిలో ఇరుక్కోవడంతో రెండో దశ మెట్రో విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మెట్రోలో ప్రయాణీకుల రాకపోకలు రోజు రోజుకూ పెరుగుతున్నా.. విపరీతంగా పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, రుణాలపై చెల్లించాల్సిన భారీ వడ్డీ కారణంగా సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు 30తో ముగిసిన తొలి ఆరు నెలల కాలానికి ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఏకంగా  405.86 కోట్ల రూపాయల నికర నష్టాన్ని చవి చూసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నష్టం 380.46 కోట్లరూపాయలతో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో భారీగా పెరిగింది.  ఏడాది వ్యవధిలోనే నష్టాల పరిమాణం కోట్లలో పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. మెట్రో కార్యకలాపాలు,  ఇతరత్రా మార్గాల ద్వారా సంస్థకు సమకూరే ఆదాయం పెరుగుతున్నప్పటికీ, పెరిగిపోతున్న ఖర్చులకు ఆ పెరుగుదల ఇసుమంతైనా  సరిపోవడం లేదు.  దీనివల్ల నెల నెలా   ఆర్థిక భారం పెరిగి పెరిగి తడిసి మోపెడౌతోంది. 

ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధ భాగంలో   మెట్రో రైలు కార్యకలాపాలు, ఇతర సేవల ద్వారా  524.78 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో వచ్చిన ఆదాయం 497.54 కోట్ల రూపాయలతో  పోలిస్తే ఆదాయం మెరుగుపడినప్పటికీ, అంత కంటే వ్యయాల పెరుగుదల ముందు ఇది దిగదుడుపుగా మారింది.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..  మెట్రో నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు, పరిపాలనా వ్యయాలు, డిప్రిసియేషన్ అన్నీ కలుపుకొని మొత్తం వ్యయం ఏకంగా  930.64 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వ్యయాలు 878 కోట్లరూపాయలుగా ఉంది.  

మెట్రో ఆర్థిక పరిస్థితిని పూర్తిగా కుంగదీస్తున్న ప్రధాన అంశం భారీ స్థాయిలో ఉన్న రుణాల వడ్డీ భారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కేవలం ఫైనాన్స్,  వడ్డీ ఖర్చుల రూపంలోనే మెట్రో 522.61 కోట్ల రూపాయలు  చెల్లించాల్సి వచ్చింది. ఈ లెక్కన చూస్తే, మెట్రో సంస్థకు కేవలం వడ్డీల రూపంలోనే రోజువారీగా సుమారు  2.85 కోట్ల రూపాయల భారం పడుతోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో తీసుకున్న భారీ రుణాలపై చెల్లించవలసిన వడ్డీలు తడిసిమోపెడవుతుండటంతో, ఎంత ఆదాయం వచ్చినా అది వడ్డీల చెల్లింపులకే సరిపోతున్న పరిస్థితి.

ఈ ఆర్థిక సమస్యల నుంచి మెట్రో ప్రాజెక్టును గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు  పలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి. మొదటి దశ మెట్రో ప్రాజెక్టును పూర్తిగా తమ చేతికి తీసుకుని, తక్కువ వడ్డీకి రుణాలను పునర్వ్యవస్థీకరించే (రీషెడ్యూల్) దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించడం ద్వారా రోజువారీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చని, తద్వారా సంస్థను దీర్ఘకాలికంగా నిలకడైన బాట పట్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ స్వాధీన ప్రక్రియ, రుణాల పునర్వ్యవస్థీకరణ చర్చలు ఇంకా తుది దశకు చేరుకోలేదు. 

మరోవైపు, నగరంలో పెరుగుతున్న రవాణా రద్దీకి తగినట్లుగా మెట్రో రెండో దశ విస్తరణ పనులను వేగవంతం చేయాలన్న డిమాండ్ రోజు రోజుకూ జోరందుకుంటోంది.  అయితే ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అవరోధాలు,  రుణాల భారం తొలగితేనే.. విస్తరణ పనులకు బాటలు పడతాయి.  అంత వరకూ రెండో దశ విస్తరణ కాగితాలకే పరిమితమౌతుంది.    


[Hyderabad Metro Losses,  Metro Rail Financial Results, Hyderabad Metro Loan Restructuring, Second Phase, Telugu One]