అమ్మాయి పేరుతో వల.. నగ్న ఫొటోలతో బ్లాక్‌మెయిల్.!
Published on: Mon Oct 19, 2026 5:22PM

1,000 మందికి పైగా టార్గెట్.. నిందితుడు అరెస్టు.!
సోషల్ మీడియాలో అమ్మాయి పేరుతో పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. ఆపై వ్యక్తిగత ఫొటోల సేకరణ.. చివరకు పోలీస్ కేసుల పేరుతో బెదిరింపులు! ఇలా హనీట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన యువకుడిని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 1,000 మందికి పైగా వ్యక్తులతో చాటింగ్ చేసినట్లు, వారిలో 82 మంది తమ నగ్న ఫొటోలు, వీడియోలు పంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మొత్తం రూ.25.16 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఫేక్ ఐడీలతో పరిచయం.. ప్రైవేట్ ఫొటోలతో వల.!.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొండభత్తుల పవన్ కుమార్ (23) అనే యువకుడు హైదరాబాద్ బాలానగర్ లోని సిఐటీడీ లో డిప్లమా కోర్సును మధ్యలోనే ఆపేశాడు... మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్నట్లుగా తల్లిదండ్రులను నమ్మించాడు.. అనంతరం బషీర్బాగ్లో స్టార్ పవర్ డిజి లోన్స్ ప్రవేట్ కంపెనీలో రెండు నెలలు ఆ తర్వాత నాన్నకు రామగుడాలోని కపిల్ చిట్ ఫండ్స్ లో మూడు నెలలు పని చేశాడు ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయకుండా.. సోషల్ మీడియా వేదికగా చేసుకొని సైబర్ మోసాలకు పాల్పడుతూ పలువురు వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు.
ఓ ఫిర్యాదు దారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పవన్ కుమార్ ఆట కట్టించారు.. నిందితుడు పవన్...అమ్మాయిల పేర్లతో నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. అవతలి వ్యక్తులతో అమ్మాయిలా మాట్లాడుతూ పరిచయం పెంచుకుని, క్రమంగా లైంగిక సంభాషణల వైపు మళ్లించేవాడు. అనంతరం ఇతరుల నగ్న చిత్రాలను పంపిస్తూ, బాధితుల నుంచి కూడా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించేవాడని పోలీసులు తెలిపారు.
‘అన్నయ్య’ ఎంట్రీతో అసలు కథ.!
బాధితుల నుంచి ఫొటోలు, వీడియోలు సేకరించిన తర్వాత కథలో మరో పాత్ర రంగ ప్రవేశం చేసేది... చాటింగ్ చేస్తున్న అమ్మాయికి తానే అన్నయ్యనంటూ నిందితుడు పవన్ బాధితులను సంప్రదించేవాడు. ఫోన్ కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వారిని బెదిరిస్తూ.. తన చెల్లెలితో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయిస్తానని భయపెట్టే వాడు. కొందరిని వ్యక్తిగతంగా కూడా కలుసుకుని డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఒక్కొక్కరికి ఒక్కో వల.. లక్షల్లో వసూళ్లు.!.
ఈ కేసులో వెలుగులోకి వచ్చిన వివరాలు మరింత విస్తుపోయేలా ఉన్నాయి. నిందితుడి స్నేహితుడొకరు కూడా ఇదే హనీట్రాప్‌లో చిక్కుకోగా, అతడి నుంచి రూ.4 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెట్టుబడులపై అధిక లాభాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి రూ.7 లక్షలు మోసం చేసినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరి నుంచి వరుసగా రూ.6.8 లక్షలు, రూ.7 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీటికి సంబంధించి మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
27 సోషల్ మీడియా ఖాతాలు.. మూడు మొబైల్ ఫోన్లు.!.
నిందితుడు ఉపయోగించినట్లు గుర్తించిన నకిలీ ఖాతాల్లో 13 ఇన్‌స్టాగ్రామ్ ఐడీలు, 14 ఫేస్‌బుక్ ఐడీలు ఉన్నాయి. మూడు మొబైల్ నంబర్లు, రెండు వాట్సాప్ ఖాతాలను కూడా ఉపయోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నకిలీ ఖాతాల్లో కోల్‌కతాకు చెందిన ‘చందన’ అనే యువతి ఫొటోలను ఎక్కువగా వినియోగించినట్లు గుర్తించి, ఆమెను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ బాధితులు.!.
ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన 24 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దుబాయ్, టర్కీ, పాకిస్తాన్, కెనడాకు చెందిన మరో తొమ్మిది మంది బాధితుల వివరాలు కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వైద్యులు, వ్యాపారవేత్తలు, లెక్చరర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, గిగ్ డ్రైవర్లు తదితరులు ఈ వలలో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల లెక్కల ప్రకారం, బెదిరించి వసూలు చేసిన మొత్తం రూ.18 లక్షలు కాగా, మోసం చేసి కాజేసిన మొత్తం రూ.7.16 లక్షలు. మొత్తంగా రూ.25.16 లక్షల మేర వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

సైదాబాద్ పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 308(7), 351(2), ఐటీ యాక్ట్ సెక్షన్లు 66C, 66D, 66E, 67A ప్రకారం కేసు నమోదు చేసి... అరెస్టు చేసి...నిందితుడి నుంచి రెడ్‌మి, వివో వై29, శామ్‌సంగ్ గెలాక్సీ మొబైల్ ఫోన్లు, హెచ్‌పీ ల్యాప్‌టాప్, 16 జీబీ పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని బాధితులు ఉన్నారా? ఇతర కేసులతో సంబంధాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల సూచనలు సోషల్ మీడియాలో పరిచయమైన అపరిచితులకు వ్యక్తిగత లేదా నగ్న ఫొటోలు, వీడియోలు పంపవద్దు. ఇలాంటి చిత్రాలతో ఎవరైనా బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తే భయపడి చెల్లించకుండా, ఆధారాలను భద్రపరచి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సైబర్ ఆర్థిక మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలి లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు..
[ Hyderabad honey trap, cyber crime arrest, fake social media accounts, blackmail extortion, Saidabad police, online scams, Pavan, CM Revanth reddy, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand ]


