OLD CITY: ఆన్‌లైన్ ఫుడ్ స్టోర్లలో దారుణాలు.. బూజు, పురుగులతో ఆహార పదార్థాలు.!
Published on: Wed Sep 30, 2026 3:36PM

హైదరాబాద్ పాతబస్తీలో ఆన్‌లైన్ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. పాతబస్తీలోని పట్టర్‌ఘాట్‌లో సిగ్గి ఆన్‌లైన్ స్టోర్స్‌తో పాటు పేట్ బషీర్‌బాద్‌లోని ఇన్‌స్టాకార్ట్ ఆన్‌లైన్ స్టోర్స్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో పలు ఆహార పదార్థాల విషయంలో విస్తుపోయే అంశాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ఆహార పదార్థాలు కాలం చెల్లినవి ఉన్నట్లు గుర్తించగా.. మరికొన్ని వస్తువుల్లో బూజు, క్రిమి కీటకాలు ఉన్నట్లు గుర్తించారు. వినియోగదారులకు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, గడువు తేదీల విషయంలో నిబంధనలు పాటించలేదని అధికారులు గుర్తించారు.

కాలం చెల్లిన, నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రెండు సంస్థల ఫుడ్ లైసెన్సులను రద్దు చేసినట్లు వెల్లడించారు.ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను ఆర్డర్ చేసే వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. ఆహార పదార్థాల గడువు తేదీ, ప్యాకింగ్, నాణ్యతను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని తెలిపారు.ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
[ Hyderabad Food Safety, Old City Hyderabad, Food Safety Raids, Online Food Stores, Food Safety Department, Expired Food, Contaminated Food, Food License Cancelled, Food Inspection, Telangana Food Safety, Food Safety Officers ]


