TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భాగ్యనగరం గొంతెండుతోంది: వానా కాలంలోనే నీటి కరవు.. వేసవిలో తిప్పలు తప్పవు.!

Published on: Fri Oct 30, 2026 9:29AM

గ్రేటర్ హైదరాబాద్ గొంతెండిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు   నీటి సరఫరాకు ఇసుమంతైనా పొంతన లేకుండా పోయింది. సరఫరా డిమాండ్ లో అంతరం రోజురోజుకూ తీవ్రమౌతోంది. విశ్వనగరంగా మన భుజాలు మనమే చరిచేసుకుంటున్న భాగ్యనగరంలో పలు కాలనీలు, బస్తీలలో నీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమౌతోంది. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రానున్న వేసవిలో జనం దప్పికతో అల్లాడకతప్పదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో ప్రజలూ, అధికారులూ, ప్రభుత్వం కూడా కలవరపడుతున్న పరిస్థితి.  

తీవ్ర వర్షా భావం కారణంగా భాగ్యనగర దాహార్తిని తీర్చే  ప్రధాన జలాశయాలలో నీటి మట్టాలు దాదాపు అడుగంటిపోయిన పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటుతుండటంతో జలమండలి అధికారులు నీటి సరఫరాపై ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతున్నారు. పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.  ఈ పరిస్థితికి తోడు బోర్‌వెల్స్‌ కూడా చాలా వరకూ ఎండిపోయిన, పోతున్న పరిస్థితి. దీంతో భాగ్యనగర వాసులు నీటి అవసరాల కోసం ట్యాంకర్ల మీదనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. 

భాగ్యనగర శివారు ప్రాంతాలలో ఇప్పటికే   తాగునీటి కొరత పీక్స్ కు చేరింది. నిర్వహణ లోపం కారణంగా పైప్‌లైన్ల లీకేజీలు, సరఫరాలో సమన్వయ లోపాలు కూడా సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి.  హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇప్పటికే   నీటి కోసం జనం క్యూ కడుతున్న పరిస్థితి.  రానున్న రోజులలో ఈ నీటికటకట మరింత ఎక్కువయ్యే ముప్పు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జలాశయాలకు నీరు చేరే మార్గాలు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటుతుండటం నీటి కరవు తీవ్ర రూపం దాల్చే పరిస్థితులు నెలకొన్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ   ప్రణాళికా లోపం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు.  

[Hyderabad Drinking Water Crisis, Greater Hyderabad Water Scarcity,Severe Water Shortage, Telangana, Telugu One]