TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

OYO హోటళ్లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు యువతులు బలి.!

Published on: Sat Oct 3, 2026 8:46PM

భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రశాంతంగా ఉంటుందనుకున్న నగరంలో నేరస్థులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బడ్జెట్ హోటళ్లు, ఓయో గదులు అసాధారణ ఘటనలకు నిలయాలుగా మారుతుండటం పట్ల నగర ప్రజలు బెంబెలెత్తుతున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఓయో హోటళ్లకు వెళ్లిన ముగ్గురు యువతులు కొద్దిరోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది.నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న ఈ విషాద ఘటనలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. మాదాపూర్ పరిధిలోని ఓ ఓయో హోటల్‌కు వెళ్లిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆ తర్వాత కొద్ది రోజులకే ఎస్సార్ నగర్ ప్రాంతంలోని మరో హోటల్‌లో వివాహిత రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. 

ఆ ఘటనలో నిందితులు నకిలీ ఆధార్ కార్డులతో గది తీసుకున్నట్లు వెల్లడడవడం నగర భద్రతను తీవ్ర ప్రశ్నార్థకంలోకి నెట్టింది.ఇక తాజాగా మియాపూర్‌లోని మరో హోటల్‌‌లో వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతి చెంది రోజులు గడుస్తుండటంతో మృతదేహం కుళ్లిపోయిన స్థితికి చేరుకుంది. ఇలా కేవలం పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు యువతులు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో దారుణంగా ప్రాణాలు కోల్పోవడం పోలీసు యంత్రాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.నిబంధనల ప్రకారం హోటళ్లకు వచ్చే ప్రతి అతిథికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. 

ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకుని, ఎంట్రీ రిజిస్టర్ నిర్వహించాలి. కానీ, చాలా చోట్ల హోటల్ యాజమాన్యాలు నిబంధనలను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. డబ్బుల కోసం కక్కుర్తి పడి సరైన ధ్రువీకరణలు లేకుండా గదులు కేటాయించడం వల్లే ఇలాంటి నేరాలకు అడ్డాగా మారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.హోటల్ రూమ్‌లలోకి అడుగుపెట్టిన తర్వాత అసలు ఏం జరుగుతోంది? వచ్చే అతిథుల వెరిఫికేషన్‌పై పోలీసుల నిఘా ఏమేరకు ఉంది? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల నిర్వహణ, రికార్డింగ్‌పై పర్యవేక్షణ లోపించడం వల్లే నేరస్థులు సులభంగా తప్పించుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


అనుమానాస్పద కదలికలు కనిపించినప్పుడు హోటల్ యాజమాన్యాలు వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ వరుస హత్యల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అప్రమత్తమయ్యారు. బడ్జెట్ హోటళ్లు, లాడ్జిలపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు పాటించని హోటళ్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, నిండు నూరేళ్ల జీవితాన్ని ఆశించి బయటకు వెళ్తున్న యువతులు ఇలా శవాలుగా మారుతుండటం తల్లిదండ్రులను కంటతడి పెట్టిస్తోంది. ఇకనైనా హోటళ్ల నిర్వహణపై కఠినమైన ఆంక్షలు విధించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు మరియు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.

 

 

[ Hyderabad crime news, OYO hotel murders, Hyderabad women safety, Budget hotel crimes, Miyapur Madhapur murder cases, CM Revanth reddy. DGP C.V. Anand, CP Sajjanar, Hyderabad police,  TeluguOne news, Telugu News]