ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు వద్దు.. సీపీ సజ్జనార్ విజ్ఞప్తి.!
Published on: Fri Oct 9, 2026 3:00PM

అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి కేక్ కటింగ్‌లు నిర్వహించవద్దని సూచించారు. సరదా కోసం చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.మూడు రోజుల క్రితం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు వేడుకల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ఆమె కుటుంబ సభ్యుడు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని, ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణనష్టం జరగడం బాధాకరమని సజ్జనార్ తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు కమిషనర్ వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌పై ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ రహదారులపై రాకపోకలు తక్కువగా ఉండటంతో కొందరు వాహనదారులు అధిక వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుందని సజ్జనర్ హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలను వెంటబెట్టుకుని రోడ్లపైకి రావడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో లేదా సురక్షితమైన ప్రదేశాల్లో జరుపుకోవాలని సూచించారు.
ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే వేడుకలు, కేక్ కటింగ్‌ల నిర్వహణపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆంక్షలు విధించిందని గుర్తుచేశారు. పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ అక్కడ వేడుకలు నిర్వహించేందుకు వచ్చే వారిని వెనక్కి పంపిస్తున్నప్పటికీ, కొందరు మళ్లీ అర్ధరాత్రి అక్కడికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కొన్ని క్షణాల ఆనందం కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టవద్దని సజ్జనర్ నగరవాసులకు సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ట్యాంక్‌బండ్‌తో పాటు చెరువుల పరిసరాలు, ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి వేడుకలకు దూరంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజు వేడుకలు ఆనందాన్ని పంచాలే తప్ప.. కుటుంబాల్లో విషాదాన్ని మిగల్చకూడదు అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
[ Hyderabad CP VC Sajjanar, Tank Bund Birthday Celebrations, Midnight Birthday Parties, Tank Bund Road Accident, Hyderabad Traffic Police, Birthday Cake Cutting Ban, GHMC Restrictions, Hyderabad Road Safety, Tank Bund Accident, Child Safety, Midnight Celebrations Ban, Hyderabad Police Advisory, Road Accident Prevention, Public Safety, Hyderabad News, Telangana News]


