TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిజాంలు తాగిన నీరు: మళ్లీ ప్రజలకు.. 356 ఏళ్ల బావికి పునర్జన్మ.!

Published on: Thu Oct 1, 2026 7:38PM

హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి. అలాంటి చారిత్రక జలవనరుల్లో శివరాంపల్లిలోని బుమ్‌ రుక్న్‌-ఉద్‌-దౌలా చెరువుకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 356 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెరువును ఇప్పటికే పునరుద్ధరించిన హైడ్రా.. ఇప్పుడు చెరువు దిగువన ఉన్న మరో చారిత్రక సంపదపై దృష్టి సారించింది. చెరువు కింద ఉన్న సుమారు 1.50 ఎకరాల విస్తీర్ణంలోని పురాతన ఊట బావిని పునరుద్ధరించే పనులకు శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటికి నిలయంగా ఉన్న ఈ బావి కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురైంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్త, మట్టి, ఒండ్రుమట్టి, దట్టమైన పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో బావి తన సహజ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఈ వ్యర్థాలను తొలగించి.. బావిని పూర్వ స్థితికి తీసుకువచ్చేలా పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయిన తర్వాత ఊట బావిలోకి సహజసిద్ధంగా నీరు చేరే అవకాశం ఉండటంతో.. ఈ ప్రాంతం మరోసారి జలకళను సంతరించు కోనుంది.బుమ్‌ రుక్న్‌-ఉద్‌- దౌలా చెరువు పునరుద్ధర ణలో  భాగంగా ఈ చారిత్రక బావి విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 8న చెరువును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలో.. చెరువు సమీపంలోని పురాతన బావి గురించి హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

దీంతో బావిని కూడా పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. చెరువు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన విమోస్‌ టెక్నోక్రాట్స్‌ సంస్థకే బావి పునరుద్ధరణ బాధ్యతలను కూడా అప్పగించారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. రెండు మూడు నెలల్లో పనులు పూర్తిచేసి బావిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకప్పుడు సుమారు 100 ఎకరాల మేర విస్తరించి ఉన్న బుమ్‌ రుక్న్‌-ఉద్‌-దౌలా చెరువు కాలక్రమంలో ఆక్రమణలకు గురైంది. చెరువు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోయి కొద్దిపాటి ప్రాంతానికే పరిమితమైంది. చెరువు ప్రాంతంలో మట్టి పోసి లేఅవుట్లుగా మార్చిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో హైడ్రా ఆక్రమణలను తొలగించి, చెరువు పరిధిని గుర్తించి పునరుద్ధరణ చేపట్టింది. చెరువును తవ్వి, అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ప్రాంతంలోని పురాతన బావిని కూడా పునరుద్ధరిస్తుండటంతో.. చెరువు, బావి రెండూ కలిసి చారిత్రక జలవనరులుగా భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండనున్నాయి. 

బుమ్‌ రుక్న్‌-ఉద్‌-దౌలా చెరువు, దాని కింద ఉన్న ఊట బావికి సంబంధించిన చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ బావిలోని నీటికి ఔషధ గుణాలు ఉండేవని, నిజాం పాలకులు ఈ నీటిని వినియోగించేవారని స్థానికంగా ప్రచారంలో ఉంది. చెరువు పరిసరాల్లో పెరిగే ఔషధ మొక్కలు, చెట్ల కొమ్మలు, బెరడులు, పూల ద్వారా నీరు సహజంగా వడపోతకు గురై బావిలోకి చేరేదని చెబుతారు. ఆ కాలంలో ఈ నీటికి ఎంతో ప్రాధాన్యం ఉండేదని, ఎడ్ల బండ్ల ద్వారా సుదూర ప్రాంతాలకు నీటిని తరలించేవారని చారిత్రక కథనాలు పేర్కొంటు న్నాయి. ఈ నీరు లండన్‌ వరకు వెళ్లినట్లు కూడా కథనాలు ఉన్నాయి. మూడో నిజాం సికందర్‌ జా పాలనా కాలంలో సుమారు 1770 ప్రాంతంలో ఈ సరస్సును నిర్మించినట్లు చారిత్రక సమాచారం చెబుతోంది. అప్పటి ప్రధానమంత్రి నవాబ్‌ రుక్న్‌-ఉద్‌-దౌలా పేరుతో ఈ సరస్సుకు ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. చెరువు, దాని కట్ట, పరిసరాల్లోని ఔషధ మొక్కలు, సహజ వడపోత వ్యవస్థ, కింద ఉన్న బౌలి.. ఇవన్నీ కలిపి చూస్తే హైదరాబాద్‌లో శతాబ్దాల క్రితమే నీటి సంరక్షణకు అనుసరించిన పద్ధతులు ఎంత శాస్త్రీయంగా ఉండేవో అర్థమవుతుంది. నీరు, ప్రకృతి, ఆరోగ్యం, వారసత్వం కలిసిన ఈ చారిత్రక వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భావితరాలకు ఒక విలువైన చారిత్రక సంపదను అందించేందుకు హైడ్రా చర్యలు చేపడుతోంది.బుమ్‌ రుక్న్‌-ఉద్‌-దౌలా చెరువుకు మళ్లీ జలకళ తీసుకొచ్చిన హైడ్రా.. ఇప్పుడు దాని కింద దాగి ఉన్న శతాబ్దాల నాటి ఊట బావికి కూడా ప్రాణం పోస్తోంది. పనులు పూర్తయితే చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ బావి మరోసారి నీటితో కళకళలాడే అవకాశం ఉంది.

 

 

 

 

[ Hyderabad, Old City, HYDRA, Bum Rukn Ud Daula Lake, Historic Well, Nizam Era, Nizam Hyderabad, 356 Years History, Shivaram Pally, Heritage Water Resources, Ancient Stepwell, Water Conservation, Hyderabad Heritage, Historic Water Body, Lake Restoration, HYDRA Restoration ]