TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..!

Published on: Fri Nov 13, 2026 4:50PM

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ ను ఎంచుకుంటారు. అయితే, వాకింగ్ చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ, దానిని నిలకడగా కొనసాగించడంలో చాలామంది విఫలమవుతుంటారు. వర్షం వచ్చిందని, చలికాలం అని, లేదా ఆ రోజు మూడ్ బాలేదని, బిజీగా ఉన్నామని రకరకాల కారణాలతో నడకను మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటో  వివరంగా తెలుసుకుంటే..

ఉత్సాహం కాదు.. సరైన ప్లానింగ్ ముఖ్యం..

చాలామంది ఫిట్‌నెస్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మొదటి రోజే ఉత్సాహంతో నలభై ఐదు నిమిషాలు లేదా గంటపాటు నడవాలని నిర్ణయించుకుంటారు. అలా మొదటి రోజు కష్టపడి నడిచాక, రెండో రోజు కాళ్ల నొప్పితో బాధపడతారు. మూడో రోజు పని ఒత్తిడి, నాలుగో రోజు వాతావరణం బాగోలేకపోవడంతో వాకింగ్ కు స్వస్తి చెబుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫిట్‌నెస్ సాధించడంలో ఎక్కువ మోటివేషన్ ఉన్నవారు కాదు, మంచి అలవాట్లు ఏర్పరచుకున్నవారే విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.

వేగం కాదు.. ఈ లాజిక్ ముఖ్యం..

గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవాలని,  హార్ట్ పాయింట్లు అని ఈ మధ్య చాలామంది వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎంత వేగంగా నడిచాం లేదా ఎంతసేపు నడిచాం అనేది ముఖ్యం కాదు, ప్రతీరోజూ నడకను కొనసాగించామా లేదా అనేదే చాలా కీలకం. ఈ క్రమంలోనే వాకింగ్ ప్రారంభించాలనుకునేవారి కోసం ఒక సులభమైన , అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే..


ఈజీగా.. హుషారుగా..

మొదటగా మొదటి మూడు వారాలు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నడవాలి. కేవలం ఐదు నిమిషాలు నడవడం వల్ల గుండెకు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు, కానీ మన మెదడుకు ఒక కొత్త అలవాటును నేర్పించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది.

మొదటి మూడు వారాలు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత, ఆ సమయాన్ని మరో ఐదు నిమిషాలు పెంచి పది నిమిషాలు చేయాలి. ఆ తరువాత మరో మూడు వారాలకు పదిహేను నిమిషాలు, ఇలా క్రమంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి.

ఇది కూడా చదవండి   మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​

ఇక్కడ ప్రధాన లక్ష్యం మొదట్లోనే శరీరాన్ని అలసటకి గురి చేయడం కాదు, నడకను ఒక మంచి అలవాటుగా మార్చుకోవడం. అలవాటు ఏర్పడిన తర్వాత ఫిట్‌నెస్ అనేది దానంతట అదే మన సొంతం అవుతుంది.

చిన్న చిన్న చిట్కాలు.. వాకింగ్ కు మార్గాలు..

నడకను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా సాగించడానికి కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందే మరుసటి రోజు ఉదయం వాకింగ్ కి వేసుకునే దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే వాటిని పక్కనే ఉంచుకోవడం మంచిది. అలాగే షూస్‌ను మంచం పక్కనే ఉంచాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల మనం అలసత్వాన్ని గెలవడం కంటే అసలు అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు.

హ్యాబిట్ స్టాకింగ్..

హ్యాబిట్ స్టాకింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని పాటించవచ్చు. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా వాకింగ్ కి వెళ్ళిపోవాలి. వాకింగ్ పూర్తయిన తర్వాతే స్నానం చేసేలా దినచర్యను మలచుకోవాలి. ఒక పాత అలవాటుకు మరో కొత్త అలవాటును ఇలా జోడించడం వల్ల పనులు మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇంట్లోనే ఐదు నిమిషాల పాటు నడవాలి కానీ వాకింగ్ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకూడదు.

మొదలు పెట్టిన రోజే పది కిలోమీటర్లు నడవడం కంటే, ఏడాది పొడవునా ప్రతీరోజూ పది నిమిషాల చొప్పున నడవడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు కావాల్సింది ఏదో ఒక్కరోజే చేసే  ప్లానింగ్ కాదు.. ప్రతీరోజూ కొనసాగించే ప్లానింగ్ కావాలి. ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ, వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.


                                                                                                                             *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు  మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!

                                మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!