ప్రేమ పేరుతో టైం పాస్ చేసేవాళ్ళను గుర్తించడం ఎలా.!
Published on: Thu Aug 27, 2026 3:19PM
ప్రేమ పేరుతో టైం పాస్ చేసేవాళ్ళను గుర్తించడం ఎలా.!

ప్రేమ అనేది రెండు మనసుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. కానీ ఈ రోజుల్లో కొంతమంది ప్రేమ పేరుతో అవతలి వ్యక్తి భావోద్వేగాలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. దీనికే టైమ్ పాస్ లవ్ అని పేరు. నిజమైన ప్రేమను, కాలక్షేపం చేసే మనస్తత్వాన్ని వేరు చేసి చూడటం మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా, ఎదుటివారి ప్రవర్తనను కొద్దిగా గమనిస్తే సులభంగా పసిగట్టవచ్చు.
ఒక వ్యక్తి మీతో నిజమైన ప్రేమతో ఉన్నారో లేక కేవలం టైమ్ పాస్ చేస్తున్నారో గుర్తించడానికి కొన్ని లక్షణాలు గమనించడం చాలా సహాయపడుతుంది. అవేంటో తెలుసుకుంటే..
అవసరం ఉన్నప్పుడే గుర్తురావడం..
నిజంగా ప్రేమించే వ్యక్తి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తోడుగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ టైమ్ పాస్ చేసేవారు వారికి బోర్ కొట్టినప్పుడు, కాలక్షేపం కానప్పుడు లేదా ఏవైనా అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే మీకు కాల్స్ లేదా మెసేజ్లు చేస్తారు. మీరు మాట్లాడాలని అనుకున్నప్పుడు మాత్రం రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటారు.
భవిష్యత్తు గురించి చర్చలు లేకపోవడం..
నిజంగా ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు గురించి ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు. కానీ భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాటవేయడం, పెళ్లి, కుటుంబం లేదా భవిష్యత్తులో కలసి ఉండే విషయాల గురించి ప్రస్తావన వస్తే, ఆ టాపిక్ మార్చడానికి ప్రయత్నిస్తారు. వారు కేవలం ప్రస్తుత ఆనందం లేదా లాభం కోసం లేదా తమ సంతోషం కోసం మాత్రమే మీతో ఉంటారు తప్ప, జీవితాంతం బంధంలో ఉండాలని ఆలోచించరు.
సీక్రెట్స్.. ఎవరిని పరిచయం చేయకపోవడం..
ఏదైనా విషయాలను సీక్రెట్ గా ఉంచడం లేదా ఎవరినీ పరిచయం చేయకపోవడం చేసేవారు నిజంగా ప్రేమించలేదని అర్థం. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు తమ జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులకు, అంటే.. స్నేహితులకు , కుటుంబ సభ్యులకు మిమ్మల్ని పరిచయం చేయడానికి ఉత్సాహం చూపుతారు. కానీ టైమ్ పాస్ చేసేవారు తమ బంధాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచడానికే ప్రాధాన్యం ఇస్తారు. మిమ్మల్ని బహిరంగంగా పరిచయం చేయడానికి సంకోచిస్తారు.
వ్యక్తిగత విషయాలపై ఆసక్తి లేకపోవడం..
మీ ఆశయాలు, మీ బాధలు, మీ ఆలోచనలను వినడానికి వారు పెద్దగా ఆసక్తి చూపరు. మీరు ఏదైనా మీ మనసులోని మాటను పంచుకుంటున్నప్పుడు వారు సరిగ్గా దృష్టి పెట్టకపోవడం లేదా విననట్లు నటించడం, ఏదో అర్జంట్ పని ఉందని తప్పించుకుని వెళ్ళిపోవడం చేస్తుంటారు. శారీరక లేదా తాత్కాలిక సంతోషాలకే వారు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
మాటలు , చేతల మధ్య తేడా..
టైం పాస్ చేసే వారిలో కనిపించే అతిపెద్ద లక్షణం.. వారి మాటలకు, చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదు. పెద్ద పెద్ద మాటలు చెప్పడం, గొప్ప వాగ్దానాలు చేయడం చేస్తారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏ ఒక్కటీ నిలబెట్టుకోరు. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక సమాధానం లేదా సాకు సిద్ధంగా ఉంచుకుంటారు.
ఎప్పుడూ అనుమానం లేదా అభద్రతా భావం కలిగిండడం..
టైం పాస్ చేసే వ్యక్తులతో ఉన్నప్పుడు మీకు మానసిక ప్రశాంతత లభించదు. ఆ బంధంలో ఏదో లోపం ఉందనే అభద్రతా భావం మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. వారు మీ పట్ల చూపుతున్న శ్రద్ధ నిజమైనది కాదనే భావన మీ అంతరాత్మకు తరచుగా తడుతూనే ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం..
ఒకరి జీవితంలో మనం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నామో తెలుసుకోవడం చాలా అవసరం. సమయం, భావోద్వేగాలు ఎంతో విలువైనవి. కాబట్టి టైం పాస్ చేసే వ్యక్తుల మాటలకు మోసపోకుండా, వారి ప్రవర్తనను గమనించి సమయానుకూలంగా సరైన నిర్ణయం తీసుకోవడం మన మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది.
*రూపశ్రీ


