గుడ్లు పగిలిపోకుండా, పర్ఫెక్ట్ బాయిల్డ్ ఎగ్స్ తయారీకి అద్భుతమైన చిట్కాలు!
Published on: Thu Oct 29, 2026 10:11AM

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో లభించే సమృద్ధిగా ఉండే ప్రోటీన్లు, విటమిన్లు మరియు ముఖ్యమైన పోషకాలు శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిరోజూ గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, ఉడికించిన గుడ్డు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఉన్నప్పటికీ, చాలా మందికి వాటిని సరైన పద్ధతిలో ఉడకబెట్టడం రాదు. తరచూ గుడ్లు ఉడికించేటప్పుడు పగిలిపోతుంటాయి లేదా సరిగ్గా ఉడకవు. ఈ చిన్న చిన్న సమస్యలకు చెక్ పెట్టి, గుడ్లను పర్ఫెక్ట్గా ఉడకబెట్టే కొన్ని సులభమైన, ఆచరణాత్మక చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం. చాలామంది ఫ్రిజ్‌లో నిల్వ చేసిన కోడిగుడ్లను నేరుగా వేడి నీటిలో ఉడకబెడుతుంటారు. అలా చేయడం వల్ల ఉష్ణోగ్రత వ్యత్యాసం కారణంగా గుడ్లు త్వరగా పగిలిపోతాయి. కాబట్టి గుడ్లను ఉడికించే ముందు కొద్దిసేపు బయట ఉంచి, గది ఉష్ణోగ్రతకు తెచ్చిన తర్వాతే ఉడకబెట్టాలి.
అలాగే, గుడ్లు ఉడకబెట్టే నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలపాలి. ఇది గుడ్డు పెంకు పగలకుండా నిరోధించడమే కాకుండా, ఉడికిన తర్వాత పెంకు సులభంగా వచ్చేలా చేస్తుంది. అలాగే కొద్దిగా తెల్ల వెనిగర్ వేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు తగినంత పెద్ద గిన్నెను ఎంచుకోవాలి. గిన్నెలో గుడ్లు పూర్తిగా మునిగేలా నీరు పోయాలి. ఒకేసారి 3 నుంచి 4 గుడ్ల కంటే ఎక్కువగా వేయకూడదు. ఎక్కువ వేస్తే అవి ఒకదానికొకటి తగిలి పగిలిపోయే ప్రమాదం ఉంది. గుడ్లను ఎప్పుడూ హై ఫ్లేమ్‌లో ఉడికించకూడదు. మీడియం వేడి మీద మరిగిస్తే గుడ్లు చెక్కుచెదరకుండా సమానంగా ఉడుకుతాయి.

గుడ్లను పరిపూర్ణంగా ఉడకబెట్టడానికి 3 3 3 పద్ధతి చాలా పాపులర్. దీని ప్రకారం, ప్రెజర్ కుక్కర్లో గుడ్లను 3 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గ్యాస్ కట్టేసి, కుక్కర్లో గ్యాస్ అంతా పోయే వరకు మరో 3 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ వెంటనే గుడ్లను చల్లటి ఐస్ వాటర్‌లో వేసి 3 నిమిషాల తర్వాత తొక్క తీయాలి. ఇలా చేస్తే గుడ్డు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఉడకబెట్టే సమయాన్ని బట్టి గుడ్డు పక్వత మారుతుంది. 6 నిమిషాలు ఉడికితే, మెత్తని పచ్చసొన, మృదువైన తెలుపు భాగం వస్తుంది. 8 నిమిషాలు ఉడికిస్తే సలాడ్లు లేదా టోస్ట్‌లలో వాడే గుడ్లకు సరైనది. 10 నుండి 12 నిమిషాలలో గుడ్డు కర్రీస్ కోసం గట్టిగా ఉడకబెట్టడానికి ఇది ఉత్తమమైన సమయం. ఉడికిన వెంటనే గుడ్లను వేడి నీటిలో నుంచి తీసి చల్లటి నీటిలో లేదా ఐస్ వాటర్‌లో వేయాలి. ఇలా చేయడం వల్ల పెంకు చాలా సులువుగా వచ్చేస్తుంది. ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తూ పోషకాలు చెక్కుచెదరకుండా రుచికరమైన ఉడికించిన గుడ్లను ఆస్వాదించండి.
How To Boil Eggs, Perfect Boiled Eggs, Egg Peeling Tips, Boiling Eggs Without Cracking, Kitchen Hacks, Easy Egg Recipe Tips, Hard Boiled Egg Guide.


